మెగా బ్రదర్స్ మీద పీకల్దాకా కోపం!
బయటకి చెప్పకపోయినా చాలామంది తెలుగుదేశం నాయకులకి మెగా బ్రదర్స్ మీద విపరీతమైన కోపం ఉంది. సందర్భానుసారం ఆ కోపాన్ని..
వాళ్లు గెలవరు, మమ్మల్ని గెలవనివ్వరు అంటున్న ‘దేశం’ నేతలు
బయటకి చెప్పకపోయినా చాలామంది తెలుగుదేశం నాయకులకి మెగా బ్రదర్స్ మీద విపరీతమైన కోపం ఉంది. సందర్భానుసారం ఆ కోపాన్ని వ్యక్త పరుస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో మెగా బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. అందులో చిరంజీవి, పవన్‌కళ్యాణ్ అగ్ర హీరోలుగా రాణిస్తుంటే, నాగబాబు టీవీషోల్లో పాపులర్ అయ్యారు. ఇదంతా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి రానంత వరకూ మెగా ఫ్యామిలీ పెద్దగా వివాదాల్లో చిక్కుకోలేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోవడం, బ్లడ్‌బ్యాంక్, సేవా కార్యక్రమాలు అంటూ జనాల్లో అభిమానం సంపాదించుకోవడంలో మెగాస్టార్ బిజీగా ఉండేవారు.
సడెన్‌గా 2008 ప్రాంతంలో రాజకీయం అనే పురుగు చిరంజీవి మెదడులో ప్రవేశించింది. అప్పటికే వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వైఎస్సార్ జలయజ్ఞం వంటి కార్యక్రమాల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం అనుయాయ మీడియా ఇప్పట్లానే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత ఉందని, తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ఇదే సరైన సందర్భమని చిరంజీవి అనుకున్నారు. అప్పుడప్పుడూ మీడియాకు లీకులు ఇస్తూ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. మెగాస్టార్ కదా రికార్డుల మీద మోజు తగ్గలేదు.
ఎన్టీయార్ పార్టీ స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు కాబట్టి, అంత కంటే తక్కువ సమయంలోనే పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి కొత్త రికార్డు నెలకొల్పాలని అనుకున్నారు. అక్కడే తప్పుటడుగులు మొదలయ్యాయి. ప్రజారాజ్యాన్ని ప్రారంభించి పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం లేకుండానే ఎన్నికల రంగంలోకి దిగారు. 17 శాతం ఓట్లు సాధించి 18 సీట్లతో చతికిలబడ్డారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ వ్యతిరేక ఓటును చీల్చి మళ్లీ వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిని చేసింది. టీయారెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలతో చంద్రబాబు ఓ కూటమి ఏర్పాటు సమష్టిగా పోరాడినా ఒక్క శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలిచింది. ప్రజారాజ్యం లేకపోతే తెలుగుదేశం 2009లో అధికారంలోకి వచ్చేదని చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా తెగ ఫీలయ్యారు. పచ్చ పార్టీ నేతల్లో చిరంజీవి మీద ఆ కోపం అలానే ఉండిపోయింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సమైక్యవాదిగా ఉన్నారు. కేసీయార్, కేటీయార్, కవిత మీద విమర్శలు గుప్పించేవారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన కొన్నాళ్లు దీక్ష కూడా చేశారు. కానీ జగన్ అంటే ఉన్న ద్వేషంతో 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చారు. బీజేపీ కూడా సపోర్ట్ చేయడంతో చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. 2019లో పవన్ విడిగా పోటీ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలి 2009లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చినట్లు 2019లో తాము అధికారంలోకి వస్తామని చంద్రబాబు అనుకున్నారు. పవన్ విడిగా పోటీ చేయడం చంద్రబాబు వ్యూహమేనని వైఎస్సార్ ప్రధాన ఆరోపణ.
2019 ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ మీద అవినీతి ఆరోపణలు గుప్పించిన పవన్ ఆ తర్వాత ఆ పార్టీ జోలికి వెళ్లలేదు. అయినా కూడా కొందరు తెలుగుదేశం నేతలకు చిరంజీవి మీద పవన్ మీద విమర్శలు మానలేదు. ఆ మధ్య టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్ చిరంజీవిపై విరుచుకుపడ్డారు. చిరంజీవి ఒక వేస్ట్ ఫెలో అని నోరుపారేసుకున్నారు. ఎనభై లక్షల మంది ఓట్లు వేస్తే, వాళ్ళందరినీ సోనియా గాంధీ కాళ్ల దగ్గర పడేసిన దౌర్భాగ్యుడని చిరంజీవి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ మాటలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అయినా దీనిమీద పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం మరింత సంచలనమైంది.
ఇటీవల పాయకరావుపేటలో ఉత్తరాంధ్ర బస్సు యాత్రను ప్రారంభించిన విశాఖపట్నం దేశం నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకున్నారు. ‘ఆ అన్నదమ్ముల వల్లే రెండు సార్లు ఓడిపోయాం’ అంటూ ఆయన విమర్శలు చేశారు. ‘వాళ్లు గెలవరు, ఇతరులను గెలవనివ్వరు. 2009, 2019లో ఆ ఇద్దరన్నదమ్ముల వల్లే టీడీపీ అధికారాన్ని కోల్పోయిందని ఆరోపించారు. మెగా బ్రదర్స్ వల్ల తాము అధికారంలోకి రాలేకపోయామన్న దుగ్ధ తెలుగుదేశం నేతల్లో ఉంది. కొందరు బయటపడుతున్నారు, మరికొందరు బయటపడటం లేదు. అంతే!