Tue Dec 24 2024 00:21:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏంటీ ప్రచారం.. అందులో నిజమెంత?
తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు ఉంటుందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. జాతీయ మీడియాలో ఈ రకమైన వార్తలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు ఉంటుందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. జాతీయ మీడియాలో ఈ రకమైన వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల హైదరాబాద్ పర్యటన తర్వాత ఈ ప్రచారం ఎక్కువయింది. ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందని రిపబ్లిక్ టీవీలో కూడా కథనం ప్రసారమయింది. చంద్రబాబు అజాదీ అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ముచ్చటించి రావడం, ఆ తర్వాత సానుకూల కథనాలు రావడం ప్రారంభమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మరోసారి టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.
బాబు వైఖరి మారినా...?
2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు వైఖరి మారిపోయింది. మోదీకి ఫుల్లు సపోర్టుగా మారిపోయారు. కేవలం ఒక ఏడాదిలోనే చంద్రబాబు తన వైఖరిని మార్చుకున్నారు. చంద్రబాబు ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చడం లేదని చెప్పి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికీ అదే పరిస్థితి. మార్పు లేకపోయినా జగన్ ను ఎదుర్కొనాలంటే బీజేపీతో సఖ్యత అవసరం అని చంద్రబాబు భావించారు. అందుకే తన పార్టీలో నమ్మకమైన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరిపోయేలా చేశారన్న ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అనేక అవసరాలను గుర్తించిన చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు.
ఆంధ్ర సెటిలర్లు....
అయితే ఇందుకు బీజేపీ అంగీకరించడానికి ప్రధాన కారణం ముందుగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలని చెబుతున్నారు. తెలంగాణలో ఆంధ్ర సెటిలర్ల మద్దతు కోసం టీడీపీని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తుందన్న కథనాలు వచ్చాయి. కానీ విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తుంది. ఇప్పుడు ఏపీ సెటిలర్లు తెలంగాణలో ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వారు ఏపీలో టీడీపీ రావాలని కోరుకోవచ్చేమో కాని, తెలంగాణలో మాత్రం సెటిలర్లంతా ఏకాభిప్రాయంతో ఒకే పార్టీకి అండగా నిలుస్తారన్న నమ్మకం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది. సామాజికవర్గాల వారీగా నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో టీడీపీ లేదు. ఆ పార్టీ 30 స్థానాల్లో ప్రభావం చూపుతుందని జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదు. అది ఒకప్పటి మాట. 2018 ఎన్నికల్లోనే రెండు నియోజకవర్గాలకు టీడీపీ పరిమితమయింది. అదీ ఖమ్మం జిల్లాలోనే రెండు సీట్లు వచ్చాయి. 30 నియోజకవర్గాల్లో కాదు కదా మూడు నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపలేని పరిస్థితిలో టీడీపీ ఉంది.
పొత్తుపెట్టుకుంటే....
చంద్రబాబు తెలంగాణలో ఓట్లను పెంచుకునే ప్రయత్నం చేయడం మానేసి చాలా కాలం అయింది. నేతలు లేరు. క్యాడర్ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ కూడా టీడీపీతో కలవడం వల్లనే నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకరిస్తుందనడం అనుమానమే. రాష్ట్ర నేతల అభిప్రాయం లేకుండా పొత్తులపై నిర్ణయం జరగదు. ఇటు ఏపీ, తెలంగాణ నేతలు టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే టీడీపీతో పొత్తుతో జరిగే ప్రయోజనం కంటే ఒనగూరే నష్టమే ఎక్కువని తెలంగాణ బీజేపీ నేతలు నివేదిక అధినాయకత్వానికి పంపారంటున్నారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నామని పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఇక ఏపీలో ఎటూ జనసేనతో పొత్తు ఉంది. అక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తును వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు కూడా దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. మరి ప్రచారం ఎందుకు జరుగుతుంది? జాతీయ మీడియాకు లీకులు ఎవరిస్తున్నారు? అన్నది తేలాలంటే కొంత సమయం పడుతుంది. బీజేపీలో ఉన్న టీడీపీ అనుకూల నేతలు కొందరు ఈ లీకులు ఇస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ, బీజేపీ పొత్తు ప్రచారానికే పరిమితం అవుతుందా? లేదా కార్యరూపం దాలుస్తుందా? అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Next Story