Fri Nov 15 2024 12:11:22 GMT+0000 (Coordinated Universal Time)
సిట్టింగ్ లూ.. సీటు.. తేడా కొట్టక తప్పదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ లు అందరికీ సీట్లు అని ప్రకటించేశారు. అయితే ఇక్కడే తేడా కొడుతుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ లు అందరికీ సీట్లు అని ప్రకటించేశారు. అయితే ఇక్కడే తేడా కొడుతుంది. పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు ఆ నాలుగు సీట్ల విషయంలో ఏం చేస్తారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. ముందుగా మాటిచ్చేసిన చంద్రబాబు ఆ తర్వాత మిత్రపక్షాల నుంచి వత్తిడి వస్తే ఏం చేస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. సిట్టింగ్ లు అందరికీ తిరిగి టిక్కెట్లు ఇవ్వడం సబబే. అది ఆయన ఇష్టం. దానిని ఎవరూ కాదనలేరు. అలాగని మిత్రపక్షాలు బలంగా ఉన్న సీట్లు కోరుకుంటే ఇవ్వక తప్పుతుందా? అన్నది కూడా సందేహమే.
ఉత్తరం.. కమలం....
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చి చెప్పలేదు. సిట్టింగ్ లందరికీ అన్నారు కాబట్టి తనకు కూడా టిక్కెట్ ఖాయమని ఆయన భావించవచ్చు. కానీ అది రేపు బీజేపీ, జనసేనలతో పొత్తు టీడీపీకి కుదిరితే అది బీజేపీకి వదిలేయాల్సిన సీటు. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ తరుపున విష్ణుకుమార్ రాజు గెలిచారు. బీజేపీతో పొత్తు కుదిరితే ఈ సీటును పొత్తులో భాగంగా గ్యారంటీగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే గంటా శ్రీనివాసరావుకు నియోజకవర్గం మార్చే అలవాటు ఉండటంతో ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆయనకు నిజంగా చంద్రబాబు టిక్కెట్ ఇవ్వదలచుకుంటే భీమిలీకి పంపించే అవకాశాలాను ఎంత మాత్రం కొట్టిపారేయలేం. అందుకు ఆయన కూడా అభ్యంతరం చెప్పరు.
సిటీలో బీజేపీ బలం....
ఇక రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం. ఇందులో ప్రస్తుతం టీడీపీ తరుపున ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఆమెకు కాని, ఆమె కుటుంబంలో ఒకరికి ఈ సీటు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఈ సీటును ఆశిస్తుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి ఆకుల సత్యనారాయణ గెలిచారు. అప్పుడు కూడా ఈ సీటును పొత్తులో భాగంగానే టీడీపీ సీటు కేటాయించింది. ఆదిరెడ్డి కుటుంబాన్ని కాదని ఈ సీటును ఏ మిత్రపక్షానికి ఇచ్చే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి నిజంగా పొత్తు కుదిరి బీజేపీ పట్టుబడితే.. చంద్రబాబు ఏం చేస్తారన్నది మాత్రం జవాబు లేని ప్రశ్నగానే చూడాలి.
రూరల్ లో జనసేన...?
మరో నియోజకవర్గం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఇక్కడ పెద్దాయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. అయితే ఇక్కడ జనసేన బలంగా ఉంది. జిల్లాలో జనసేన సీనియర్ నేత కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఆయనకు కాపులు బలంగా ఉండే రాజానగరం సీటు ఇవ్వాలని చంద్రబాబు భావించినా అందుకు కందుల దుర్గేష్ అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. జనసేనతో పొత్తు అంటూ కుదిరితే కందుల దుర్గేష్ కోసం పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోసం పట్టుబట్టే అవకాశముంది. అప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఏం చేస్తారన్నది ప్రశ్న. పెద్దాపురం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. నిమ్మకాయల చినరాజప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ జనసేన బలంగా ఉండటం, గతంలో ఇక్కడ ప్రజారాజ్యం గెలవడంతో దానిని ఎంచుకునే అవకాశముంది. అందుకే టిక్కెట్ ఖాయమైనా కొందరి సీట్లు పొత్తులో భాగంగా మార్చే అవకాశాలు లేకపోలేదు.
Next Story