Fri Nov 08 2024 06:58:32 GMT+0000 (Coordinated Universal Time)
వ్యూహం మార్చిన బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకున్నారు. పొత్తులపై పునరాలోచనలో పడ్డారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులపై నిర్ణయం తీసేసుకున్నారా? అధికారానికి దగ్గరగా ఉన్నట్లు ఆయన వద్ద నివేదికలు ఉన్నాయా? అంటే పార్టీ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. పొత్తులతో వెళ్లేకన్నా ఒంటరిగా వెళ్లి ఈసారి గోల్ రీచ్ కావాలన్న పట్టుదల నాయుడులో కనిపిస్తుందంటున్నారు ఆయన సన్నిహితులు. పొత్తులకు వెళ్లేకంటే ఒంటరిగానే వెళ్లడం మేలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచి.. తన మీద ఉన్న అపప్రధను తొలగించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి.
బలంగా టీడీపీ...
ఎవరు అవునన్నా కాదన్నా... ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పటిష్టమైన క్యాడర్ ఉంది. ప్రతి గ్రామంలో పట్టుదల ఉన్న కార్యకర్తలు ఒక్క టీడీపీకే ఉన్నారు. గత నాలుగేళ్ల నుంచి జగన్ ప్రభుత్వంపై పోరాడుతుంది కేవలం చంద్రబాబు మాత్రమే. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇటు బీజేపీకి ఏపీలో ఓటు బ్యాంకు కూడా లేదు. జనసేన కేవలం రెండు జిల్లాలకే పరిమితమైన పార్టీగా ముద్ర పడింది. సరైన నాయకత్వం, క్యాడర్ తో పాటు బూత్ స్థాయి కార్యకర్తలు కూడా ఆపార్టీకి మిగిలిన ప్రాంతాల్లో కనపడని పరిస్థితి.
తాము పడిన కష్టం....
నిజానికి తాను, లోకేష్ పడిన... పడుతున్న కష్టం మిగిలిన మిత్రపక్షాలు ఎవరూ పడటం లేదు. తాను నిరంతరం జనంలోనే ఉంటున్నారు. లోకేష్ గత కొద్ది రోజులుగా యువగళం పాదయాత్రలో ఉన్నారు. కానీ మిగిలిన పార్టీలు పొత్తుల రూపంలో వచ్చి సీట్లు తన్నుకుపోతాయన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. ఆ వ్యతిరేక ఓట్లన్నీ తన వైపే చూస్తున్నాయన్నది కూడా అంతే నిజమని ఆయన విశ్వసిస్తున్నారు. జనసేన, బీజేపీ వైపు జనం చూసేందుకు అవకాశమే లేదని ఆయన అనుకుంటుండటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెబుతున్నారు. నియోజకవర్గాల నేతల నుంచి కూడా అదే రకమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. పొత్తులతో ఇబ్బందులు తలెత్తుతాయని రాబిన్ శర్మ టీం కూడా నివేదిక ఇచ్చిందంటున్నారు.
పొత్తు అనవసరమా?
ఈ నేపథ్యంలో అనవసరంగా ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని సీట్లు పంపిణీ చేసే కన్నా ఒంటరిగానే పోటీ చేయడం మంచిదన్న భావనలో ఉన్నారు. ఇటీవల సీనియర్ నేతలతో కూడా చంద్రబాబు ఈ విషయంపై సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన కొన్ని సీట్లు గెలిచినా... ఎన్నికల తర్వాత తమకే మద్దతు తెలుపుతుందన్న ధీమాలో ఉన్నారు. అప్పుడే వారికి అవసరమైతే మంత్రివర్గంలో స్థానం కల్పించడం బెటర్ అని, అప్పుడయితే ఒకటి, రెండు మంత్రి పదవులతో సరిపెట్టవచ్చని, కానీ ఎన్నికలకు ముందు పొత్తు అంటే ఎక్కువ సీట్లను టీడీపీ కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఒంటరిగా పోటీ చేసేందుకు అయినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నేతలతో జరుగుతున్న అంతర్గత సమావేశాల్లో చెబుతున్నట్లు తెలుస్తోంది.
నేతలు కూడా...
బలం లేని పార్టీలతో పాటు... జనంలో వ్యతిరేకత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే కన్నా తాము సింగిల్ గానే వెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. మిత్రపక్షాలకు సరైన నాయకులు లేకపోవడం, పొత్తులు ఉంటాయన్న సంకేతాలతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జనసేన వైపు మరలడాన్ని కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమయింది. దీర్ఘకాలం పార్టీతో కొనసాగుతున్న నేతలను పొత్తుల కారణంగా దూరం చేసుకోవడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదు. పోనీ.. పొత్తులలో సీట్లు కోల్పోతే వారికి ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పినా ఇప్పుడు వినేందుకు సిద్ధంగా లేరు. అందుకే పొత్తుల విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఓట్లు బదిలీ...
ప్రస్తుతం ఏపీలో వార్ వైసీపీ వర్సెస్ టీడీపీ గానే నడుస్తుంది. పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా ఆ క్రెడిట్ పవన్ కల్యాణ్, బీజేపీ తిరిగి కొట్టేస్తారు. ఏడాదిన్నర కాలం పాటు పాదయాత్ర చేసిన తనయుడు లోకేష్ తో పాటు, ఇన్నాళ్లు తాను పడిన కష్టం కూడా బూడిద పాలవుతుందని ఆయన భావిస్తున్నారు. తన సమర్థతపైనే జనం నమ్మకంతో ఓటేస్తారు తప్పించి... పొత్తులు కారణంగా ఓట్లు వేయరన్నది చంద్రబాబు ఆలోచన. దీంతో పాటు మిత్ర పక్షాలకు చెందిన ఓటు బ్యాంకు తమ పార్టీకి బదిలీ అవుతుందన్న నమ్మకం కూడా పెద్దగా లేదు. దీంతో పొత్తుల విషయంపై చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అవసరమైతే పలు దఫాలు సర్వేలు చేయించి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం బెటరన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. ఒకవేళ సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించాల్సి వచ్చినా తక్కువ సీట్లతో సరిపెట్టాలని, ఎన్నికల చివరి వరకూ పొత్తుల అంశాన్ని నాన్చడమే మంచిదన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story