Mon Dec 23 2024 23:26:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు ఆ క్లారిటీ వచ్చేసిందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్నారు. ఆ నియోజకవర్గం నేతలకు క్లాస్ పీకుతున్నారు. అభ్యర్థిని మార్చడం కంటే ఆ నియోజకవర్గాన్ని మిత్రపక్షాలకు ఇవ్వడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. అందుకే ఆయన కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికీ ఇన్ఛార్జులను నియమించడం లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. దాదాపు నాలుగేళ్లవుతున్నా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల నియామకాన్ని పెండింగ్ పెట్టడానికి పొత్తు ప్రధాన కారణమంటున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం టిక్కెట్ ను ఆయన ముందుగానే ఖరారు చేశారు.
వంద నియోజకవర్గాల్లో...
ఖచ్చితంగా గెలిచే వంద నియోజవర్గాల్లో మాత్రం బలమైన నేతలను దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. వారు ఒకసారి ఓడిపోయారా? మూడు సార్లు ఓడిపోయారా? లేక ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇవ్వడమా? వంటి నిబంధనలను పక్కన పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలను ఎంపిక చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. అధికార వైసీపీని సమర్థంగా ఎదుర్కొనాలంటే సామాజికవర్గాలను కూడా సైడ్ చేయాలన్న భావనలో ఆయన ఉన్నారు. కాసులు ఎవరైతే ఎక్కువ ఖర్చు చేస్తారో వారికే టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయన్నది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. 40 శాతం యువతకే టిక్కెట్లు ఇస్తానన్న ప్రకటన కూడా అందుకేనంటున్నారు.
బలంగా ఉన్న వైసీపీని..
అధికార వైసీపీ అన్ని విధాలుగా బలంగా ఉంది. ఈసారి ఎలక్షనీరింగ్ కూడా ముఖ్యమే. కార్యకర్తలను ఏడాది ముందు నుంచే సమాయత్తం చేసుకోవాల్సి ఉంటుంది. పైగా ఈసారి టీడీపీ గతంలో మాదిరి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆశించిన స్థాయిలో నిధులు ఇచ్చే అవకాశం కూడా లేదంటున్నారు. ఇప్పటికే ఆర్థికంగా పార్టీ కొంత ఇబ్బంది పడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఎన్నికల సమయానికి బీజేపీతో పొత్తు లేకపోతే విరాళాలు ఇచ్చేందుకు కూడా వెనకాడే పరిస్థితి ఉంటుంది. అందుకే ముందుగానే ఆర్థికంగా బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.
సర్వేలు చేయిస్తూ...
ఇందుకోసం సర్వేల మీద సర్వేలు చేయిస్తూ అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. రిజర్వడ్ నియోజకవర్గాలకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చినా, మిగిలిన వాటిల్లో మాత్రం ఫైనాన్షియల్ గా ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తారో తెలుసుకున్న తర్వాతనే అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. అలాగే పార్లమెంటు సభ్యుల విషయంలోనూ అదే తరహా పద్ధతిని ఈ సారి పాటిస్తారంటున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలను ఇస్తామని పాత నేతలకు హామీ ఇచ్చి అయినా సరే కొత్త నేతలను రంగంలోకి దించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. అక్కడ గెలిపించుకుని వస్తేనే ఎమ్మెల్సీ అయినా, రాజ్యసభ అయినా దక్కుతుందని ముందుగానే హామీ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. లేకుంటే మాత్రం నిర్మొహమాటంగా ఈసారి ఓల్డ్ నేతలు అనేక మంది మాత్రం టిక్కెట్ కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Next Story