Fri Nov 08 2024 09:00:59 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నేతపై బాబుకు అంత నమ్మకమా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి లక్ష మెజారిటీతో రావాలని భావిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి లక్ష మెజారిటీతో రావాలని భావిస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాను ఇన్నాళ్లు నమ్మిన నేతలను పక్కనపెట్టి కొత్త వారికి ఇన్‌ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఇది కుప్పం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఎప్పుడూ లేనిది ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కుప్పం తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చే జరుగుతుంది. చంద్రబాబు ఇన్నాళ్లు నమ్మిన నేతలు తనను ముంచేస్తారని చంద్రబాబు భయపడ్డారా? లేక కొత్త నాయకత్వానికి అప్పగిస్తేనే తప్ప గెలుపు తప్పదని చంద్రబాబు భావించే ఈ నిర్ణయం తీసుకున్నారంటారు మరికొందరు నేతలు.
ఎదురులేకుండా...
చంద్రబాబుకు కుప్ప నియోజవకర్గంలో ఎదురులేదు. 1989 నుంచి 2019 ఎన్నికల వరకూ వరస గెలుపులతో ఆయన కుప్పంలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. ఏడుసార్లు విజయం సాధించిన చంద్రబాబు ఈసారి కూడా గెలుపు కోసం భయపడాల్సిన అవసరం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చిన ఫలితాలు చంద్రబాబును కొంత ఆలోచింప చేశాయని అంటున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ ముప్ఫయివేలకు పడి పోయింది. ఇవన్నీ కొంత చంద్రబాబును ఇబ్బంది పెట్టాయంటున్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారని భావిస్తున్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావడంతో కుప్పంలోనే తిష్ట వేసేందుకు వీలు లేదు. అలాగని మొన్నటి వరకూ తనకు అండగా ఉన్న నేతలను నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వారి ఉదాసీన వైఖరి కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నది చంద్రబాబు నమ్మకం.
ఇన్ఛార్జిగా శ్రీకాంత్...
అందుకే తాజాగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను నియమించారు. కంచర్ల శ్రీకాంత్ ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించారు. వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆయన గెలుపొందడంతో కంచర్ల శ్రీకాంత్ చంద్రబాబు దృష్టిలో పడ్డారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్ అనుసరించిన వ్యూహాలే ఆయనను గెలిపించాయని అందరూ నమ్ముతారు. ప్రత్యర్థి సామాజికవర్గంలోనూ, ఆర్థికంగానూ బలమైన నేత అయినప్పటికీ గెలిచాడంటే శ్రీకాంత్ సమర్థతను కొట్టిపారేయలేం అంటున్నారు టీడీపీ నేతలు. అందుకే ఏరి కోరి చంద్రబాబు కంచర్ల శ్రీకాంత్ కు కుప్పం నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారంటున్నారు.
ఆయన స్ట్రాటజీలపై...
కంచర్ల శ్రీకాంత్ స్ట్రాటజీలపై నమ్మకం ఉంచిన చంద్రబాబు పూర్తిగా ఆయనకు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. దీంతో పాటు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్‌లో ఏదో నామమాత్రంగా నియమించారని కుప్పంలో అనుకుంటున్నారు. కుప్పంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కంచర్ల శ్రీకాంత్‌కు పూర్తి స్థాయి అధికారాలను అప్పగించారని చెబుతున్నారు. ఆయన చెప్పినట్లే నియోజవకర్గంలో నేతలు నడుచుకోవాలని కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద తొలిసారి ఒక నేత రాజకీయ వ్యూహాలపై నమ్మకం పెట్టుకుని చంద్రబాబు కీలకస్థానం అప్పగించారని పార్టీలో చర్చ జరుగుతుంది.
Next Story