Tue Dec 24 2024 02:19:30 GMT+0000 (Coordinated Universal Time)
నో బార్ గెయినింగ్.. తగ్గేదేలేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు సిద్దమవుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు సిద్దమవుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలను, క్యాడర్ లో జోష్ నింపేందుకు ఆయన జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన ఉంటుంది. తొలిగా ఆయన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఒకొక్క జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు మకాం వేస్తారు. తొలిరోజ మహానాడు నిర్వహిస్తారు. రెండో రోజు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను సమీక్షిస్తారు. మూడో రోజు రోడ్ షోలతో ప్రజల చెంతకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఇప్పటి నుంచే....
చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. దాదాపు ఏడాది పాటు జిల్లాల్లోనే పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. మొత్తం 26 జిల్లాలను చుట్టేసి రావాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆ దిశగా రూట్ మ్యాప్ ను పార్టీ నాయకత్వం రూపొందించింది. ప్రతి జిల్లాలో జరిగే రోడ్ షోలు సక్సెస్ అయ్యేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రతి నాయకుడు రోడ్ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
తన శక్తి ఏంటో?
పొత్తుల విషయంలో సందిగ్దంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు జిల్లాల పర్యటనతో తమ సత్తాను చూపించాలని భావిస్తున్నారు. పార్టీకి ఉన్న శక్తి సామర్థ్యాలను రోడ్లపై ప్రదర్శించనున్నారు. వైసీపీకి ప్రత్నామ్నాయం టీడీపీయేనని, ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం చంద్రబాబుకేనన్న సంకేతాలు ఈ రోడ్ షోల ద్వారా తమతో కలవాలనుకుంటున్న రాజకీయ పక్షాలకు ఆయన చూపించాలనుకుంటున్నారు. అతిగా ఊహించుకోకుండా వాస్తవ పరిస్థితులు ఇవీ అని తెలియజేసేందుకు జల్లాల పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.175 స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థి అంటూ ప్రచారాన్ని టీడీపీ మొదలు పెట్టింది.
బార్ గెయినింగ్....
తాము కలవాలనుకుంటున్న పార్టీలు ఎక్కువ ఊహించుకుంటున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలు ఆల్టర్నేటివ్ గా తననే కోరుకుంటున్నారని చూపించాలి. బార్ గెయినింగ్ అవతలి నుంచి రావాలి. అంతే తప్ప ప్రధాన పార్టీగా ఉన్న తాము ఎట్టిపరిస్థితుల్లో తగ్గకూడదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అందుకే ఏడాది పాటు జిల్లాల పర్యటనను చంద్రబాబు చేపట్టారు. నెలకు రెండు జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడమే కాకుండా, ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story