Sat Nov 23 2024 00:04:47 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుతో పొత్తు వికటిస్తుందా?
తెలంగాణలో బీజేపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం సిద్ధంగా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవాలని అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకూ కోరుకుంటున్నారు. బీజేపీకి ఓటు బ్యాంకు లేకపోయినా భరోసా కోసం దాని పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో తొలుత పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తుంది. చంద్రబాబుతో పొత్తు వికటిస్తుందా? కానీ తెలంగాణలో చంద్రబాబును ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకిగానే చూస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపినప్పుడు చంద్రబాబును టార్గెట్ చేసుకునే కేసీఆర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చంద్రబాబు పెత్తనం వస్తుందన్న 2018 ఎన్నికల్లో స్లోగన్ అందుకున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో..
ిఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు అవసరమవుతాయని బీజేపీ భావించి పొత్తు పెట్టుకున్నా తిరిగి కేసీఆర్ అదే సెంటిమెంట్ ను తెరపైకి తీసుకురాకుండా ఉండరు. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలు అనేక మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. గత ఎన్నికల సందర్భంగా అప్పట్లో అమిత్ షా టీడీపీతో పొత్తు ఉండదని ముందుగానే ప్రకటించారు. దీంతో టీడీపీ కాంగ్రెస్ తో కలసి మహాకూటమిలోకి వెళ్లింది. తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినా తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్ ఉందన్నది అగ్రనేతల అంచనా. ఇటువంటి సమయంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే అసలుకే ఎసరు వస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. బీజేపీలోని రాష్ట్ర స్థాయి నేతలు కొందరు టీడీపీతో పొత్తుకు ఇష్టపడటం లేదు.
కాంగ్రెస్ కు జరిగిన నష్టమే...
గతంలో కాంగ్రెస్ కు జరిగిన నష్టమే తమకు జరుగుతుందని ఇప్పటికే కొందరు అధినాయకత్వానికి నివేదికలు పంపారని చెబుతున్నారు. 2018 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాము అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వేరు. తెలంగాణ వేరు. ఏపీలో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కొంత ప్రయోజనం ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ జీరో స్థాయిలో ఉంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ను తోసిరాజని ఇప్పటికే కొంత బీజేపీ ముందుకు వచ్చింది. ఈ సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అసలుకే ఎసరు వస్తుందన్న భయం బీజేపీ రాష్ట్ర నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇప్పుడు కాకపోయినా...?
119 నియోజకవర్గాల్లో తమకు సరైన అభ్యర్థులు లేకపోయినా జనసేనను మాత్రం ఆహ్వానించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన చంద్రబాబు మనిషిగానే తెలంగాణలో టీడీపీ ఓటర్లు భావిస్తారు. అలాంటప్పుడు టీడీపీతో ఇక్కడ పొత్తు పెట్టుకున్నా పెద్దగా ప్రయోజనం లేదన్న అంశాన్ని కొందరు అధినాయకత్వానికి సూచిస్తున్నారు. ఒంటరిగానే బరిలోకి దిగి తేల్చుకుందామన్నది కొందరి ఆలోచన. అయితే కేంద్ర నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నందున నష్టమే తప్ప లాభమనేది అస్సలు ఉండదని, కేసీఆర్ చేతికి మరో అస్త్రం ఇచ్చినట్లవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story