Mon Dec 23 2024 06:14:36 GMT+0000 (Coordinated Universal Time)
బాబుది అవుట్ డేటెట్ స్ట్రాటజీ అట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా లేవు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా లేవు. ఆయన అన్ని వర్గాలను కలుపుకుని పోవాలనుకుంటున్న తరుణంలో కేవలం కాపు సామాజికవర్గం అండగా ఉండాలని కోరుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీలో కాపులు గెలుపోటములను నిర్దేశించవచ్చు. కానీ వారే అధికార పీఠం మీద కూర్చోబెడతారన్న గ్యారంటీ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ తోడైతేనే గెలుపు సాధ్యమవుతుంది.
కాపుల కోసం....
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కాపు, బీసీ, మైనారిటీ ఓటు బ్యాంకు బలంగా ఉండేది. కానీ రానురాను ఈ సామాజికవర్గాలు చంద్రబాబుకు దూరమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికలకు ముందు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఈబీసీ కోటా నుంచి ప్రకటించడంతో బీసీలు దూరమయ్యారు. గత ఎన్నికల్లో బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది.
బీసీలు యాంటీ...
ఇప్పుడు చంద్రబాబు మరోసారి కాపు ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపీలో కాపులు ఎటు వైపు మొగ్గు చూపితే బీసీలు దానికి యాంటి అవుతారు. కాపులు తమ రిజర్వేషన్లు కోరడమే రెండు సామాజికవర్గాల మధ్య దూరం పెరగడానికి కారణం. కాపులు గంపగుత్తగా ఒకే వైపు మొగ్గు చూపుతారన్న గ్యారంటీ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ కల్యాణ్ తో పొత్తు కుదుర్చుకుంటే ఖచ్చితంగా బీసీలు టీడీపీకి యాంటీ అవుతారన్న అంచనా ఉంది.
కాపులతోనే సాధ్యమా?
వైసీపీ కూడా అదే కోరుకుంటుంది. చంద్రబాబు వ్యూహాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేయవన్నది వైసీపీ నమ్మకం. దశాబ్దాలుగా టీడీపీ వెంట ఉన్న బీసీలు గత ఎన్నికల్లో తమ వైపునకు టర్న్ కావడం, జగన్ వారికి పదవులతో పాటు నామినేటెడ్ పనులను కూడా కేటాయించడంతో అది చెక్కుచెదరదన్న విశ్వాసం వైసీపీ నేతల్లో ఉంది. చంద్రబాబు మాత్రం బీసీలు తమ వైపు వస్తారన్న నమ్మకంతో కాపులను మంచిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా లేవని పార్టీ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు.
Next Story