Thu Nov 28 2024 17:31:40 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరి వాదనలో ఎంత నిజం?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలు అంటేనే ఉద్రిక్తతల మధ్య సాగుతున్నాయి. టెన్షన్ నెలకొంటుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలు అంటేనే ఉద్రిక్తతల మధ్య సాగుతున్నాయి. టెన్షన్ నెలకొంటుంది. పోలీసులు అనుమతివ్వకపోవడం, దానిని టీడీపీ నేతలు థిక్కరించడం మామూలు విషయంగా మారింది. జీవో నెంబరు 1 అమలులో ఉందంటూ పోలీసులు చెబుతున్నా.. ఇరుకుసందుల్లోనే చంద్రబాబు సభలు పెట్టడం ఆయన తప్పు కాదా? ఆ వయసులో చంద్రబాబును కిలో మీటర్ల కొద్దీ నడిచేలా చేయడం సర్కార్ తప్పిదం కాదా? అంటే రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు. ఎదుటి వారిదే తప్పు అంటూ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటుండటం పరిపాటిగా మారిపోయింది.
జీవో నెంబరు వన్....
చంద్రబాబు రోడ్ షోల సందర్భంగా కందుకూరులో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. అలాగే గుంటూరు సభలో ముగ్గురు అమాయకులు మరణించారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబరు 1ను తీసుకు వచ్చింది. దానిపై అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను విపక్షాలు ఆశ్రయించాయి. అయితే నిబంధనలను ఉల్లంఘించి చంద్రబాబు రోడ్డుపైన, ఇరుకుసందుల్లో సభలను పెట్టడం ఎందుకు? ఆయన బహిరంగ సభలను విశాలమైన మైదానంలో ఏర్పాటు చేసుకుంటే పోలీసులు అభ్యంతరం పెట్టరు. ఆ విషయం తెలిసినా తనను అడ్డుకుంటే సానుభూతి వస్తుందన్న కారణంతోనే చంద్రబాబు ఇరుకుసందుల్లో సభలను పెడుతున్నారని అధికార పార్టీ ఆరోపిస్తుంది.
ఇరు వర్గాల వాదనలు...
అయితే చంద్రబాబు మాత్రం పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తున్నారని, స్వచ్ఛందంగా జనం తమ సభలకు తరలి వస్తుంటే ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం పోలీసుల ద్వారా ఈ ప్రభుత్వం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రహదారిలో సభను ఏర్పాటు చేసి సవాలు విసురుతూ రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరించడం సరికాదన్న వాదనలూ లేకపోలేదు. చంద్రబాబు రోడ్ షోకు మాత్రమే తాము అనుమతిచ్చామని, కావాలని రోడ్డుపై సభను పెట్టి పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరారని, తమపై కార్యకర్తలు దాడి చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. తప్పు ఇద్దరి వైపు ఉంది. నిబంధనలను పాటించడం మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ధర్మం.
వైసీపీకే నష్టమా?
అదే సమయంలో సంయమనం పాటించడం పోలీసుల విధి. పోలీసులే రోడ్డు మీద బైఠాయించి ఆయన వయసును కూడా చూడకుండా కిలో మీటర్ల కొద్ది నడిపించడం కూడా భావ్యం కాదు. అందుకే చంద్రబాబు ప్రతి పర్యటన ఇక టెన్షన్ గానే సాగుతుంది. సెక్షన్ 30 అమలులో ఉందని చెబుతున్నా చంద్రబాబు వినలేదని పోలీసులు అంటున్నారు. ముందుగానే అనుమతి తీసుకున్నామని టీడీపీ చెబుతుంది. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. జగ్గంపేట, పెద్దాపురంలో రాని పరిస్థితి అనపర్తిలోనే ఎందుకు వచ్చిందన్న ప్రశ్న కూడా తలెత్తుంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా చంద్రబాబును ఎంత నిలువరించే ప్రయత్నం చేస్తే వైసీపీకి అంత నష్టం జరుగుతుందన్న ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. అలాగని చంద్రబాబు ప్రతి పర్యటనలో ఇలాగే నిబంధనలు గాలికొదిలి ప్రయత్నించి పోలీసులు అడ్డుకున్నారని యాగీ చేయడాన్ని కూడా ప్రజలు హర్షించారన్నది అంతే వాస్తవం.
Next Story