Wed Nov 27 2024 21:28:45 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీతో జనసేన పొత్తు ఫార్ములా ఇదేనట
జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ మానసికంగా పొత్తుకు సిద్ధమయింది. జనసేన కూడా అందుకు రెడీ అయిపోతుంది
జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ మానసికంగా పొత్తుకు సిద్ధమయింది. జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం అధినేత చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల నుంచి వ్యక్తమవుతుంది. ఇది జనసేన పార్టీకి అడ్వాంటేజీగా మారుతుంది. తాము బీజేపీతో ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్నామని, పొత్తు ఆలోచన లేదని జనసేన నేతలు చెబుతున్నారు. కానీ అవి బయట మాటలే. లోలోపల మాత్రం జనసేన కూడా టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోతుందంటున్నారు.
జిల్లాకు నాలుగు...
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి జిల్లాకు నాలుగు స్థానాలు ఇవ్వాలని భావిస్తుంది. మొత్తం 13 జిల్లాల్లో జనసేనకు 52 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. బలంలేని జిల్లాల్లో సీట్లు తగ్గించుకుని బలం ఉన్న జిల్లాల్లో సీట్లు పెంచుకునేందుకు వీలు కూడా ఉందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే రకమైన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కడప వంటి జిల్లాలో స్థానాలను తగ్గించుకుని తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలను జనసేన తీసుకునే వీలుంది. కానీ జనసేన మాత్రం జిల్లాకు ఆరు స్థానాలను కోరే అవకాశముంది.
ముఖ్యమంత్రి పదవి....
అయితే ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి పదవి ఎవరికి అన్నది కూడా తేల్చాల్సి ఉందట. జనసేన, టీడీపీ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే ఫిఫ్టీ ఫార్ములాను అప్లయి చేయాలని జనసేన అగ్రనేతలు భావిస్తున్నారు. తొలి లేదా చివర రెండున్నరేళ్లు జనసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న షరతు విధించాలన్న యోచనలో కూడా ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఈ ఒప్పందానికి వస్తేనే పొత్తు చర్చలకు వీలవుతుందన్న సంకేతాలను పంపాలన్న భావనలో ఉన్నారు.
ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఫార్ములా....
పొత్తు పెట్టుకుని కేవలం చంద్రబాబుకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం ఎందుకన్న ఆలోచనలలో పవన్ కల్యాణ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కర్ణాటకలో 36 స్థానాలు వచ్చిన జేడీఎస్ కు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే ముఖ్యమంత్రి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాకు చంద్రబాబు అంగీకరించాల్సిందేనంటున్నారు. ఆ విషయంలో స్పష్టత ఇస్తేనే పొత్తు చర్చలు ముందుకు సాగుతాయట. సీట్ల సంఖ్య తమకు ముఖ్యంకాదని, తమ అధినేత ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమని జనసేన నేతలు చెబుతున్నారు.
Next Story