Tue Nov 19 2024 04:16:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇది నా అడ్డా అనుకుంటే ఇలా అయిందేంటి?
తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియకు రానున్న రోజుల్లో రాజకీయ కష్టాలు మరింత పెరిగే అవకాశముంది.
తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియకు రానున్న రోజుల్లో రాజకీయ కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. కుటుంబంలోనే చీలికలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆస్తి వివాదాలతో ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యమైన సన్నిహితులను అఖిలప్రియ దూరం చేసుకున్నారు. అఖిలప్రియకు ఇప్పుడు రాజకీయంగా చేదోడు వాదోడుగా నిలిచేవారే కరువయ్యారు. ఆళ్లగడ్డ లాంటి అడ్డాలో కూడా అఖిల తన భర్తకు తప్ప దాదాపు అందరికీ దూరమయ్యారనే చెప్పాలి.
భర్తే కారణం...
ప్రధానంగా ఆళ్లగడ్డలో భూమా కుటుంబంలో చీలిక రావడంతో వారు వేరు కుంపటి పెట్టుకున్నారు. బీజేపీలో చేరిపోయారు. అఖిలప్రియ వివాహం తర్వాతనే కుటుంబంలో వివాదాలు తీవ్రమయ్యాయి. ఇప్పుడు ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఒంటరి అయ్యారనే చెప్పాలి. నంద్యాల సీటు తన చేజేతులా అఖిలప్రియ వదులకుంది. అక్కడ భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ లో యాక్టివ్ గా ఉన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని అఖిలప్రియ చెప్పారని మరొకరికి సీటు ఇచ్చే అవకాశం లేదు.
కుటుంబ సభ్యుల నుంచి..
అఖిలప్రియను రాజకీయంగా పక్కకు తప్పుకోవాలన్న డిమాండ్ కుటుంబ సభ్యుల నుంచే వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిని పోటీకి దింపాలని కోరుతున్నారు. క్యాడర్ లో కూడా అఖిలప్రియ భర్త పోకడలు ఇబ్బందిగా మారడంతో వారు కూడా జగద్విఖ్యాత్ రెడ్డి తమ లీడర్ కావాలని ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా అఖిలప్రియ విషయంలో పునరాలోచనలో పడిందని అంటున్నారు.
అనుభవలేమి.....
గతంలో టీడీపీ అగ్రనాయకత్వంతో అఖిలప్రియ మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి టచ్ లో ఉంటూ భూమా నాగిరెడ్డి, శోభ మరణం తర్వాత రాజకీయంగా అండగా నిలిచారు. కానీ ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. దీంతో అగ్రనాయకత్వంతో మాట్లాడే పరిణితి, రాజకీయ అనుభవం అఖిలప్రియకు లేకపోవడం మైనస్ గా మారింది. మరోవైపు అనేక కేసుల్లో ఇరుక్కోవడం కూడా రాజకీయంగా ఇబ్బందిగా మారింది. కర్నూలు జిల్లాలోని టీడీపీ సీనియర్ నేతలు ఫరూక్ వంటి వారు కూడా అఖిల పట్ల సానుకూలంగా లేరు. దీంతో సొంత ఇంట్లోనే అఖిలప్రియకు షాక్ లు తగులుతున్నాయి.
Next Story