Thu Jan 16 2025 02:03:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నేతకు లోకేష్ హామీ.. ఆ టిక్కెట్ ఆయనకేనట
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో మంగళగిరిలోనే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో మంగళగిరిలోనే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయన ఈసారి తన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఈరోజు కూడా మంగళగిరిలో ఆయన పర్యటించారు. అయితే అక్కడ టీడీపీకి ప్రధాన నేతగా ఉన్న గంజి చిరంజీవికి లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకూ గెలుపు సాధించలేదు. 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మంగళగిరి నుంచి గెలిచారు.
మూడున్నర దశాబ్దాల నుంచి....
అదే టీడీపీికి మంగళగిరిలో చివరి గెలుపు. మూడున్నర దశాబ్దం నుంచి మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురలేదు. ఇక్కడ పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు. అదే సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి 2014 ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినా గెలవలేదు. 2019 ఎన్నికల్లో స్వయంగా లోకేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి గంజి చిరంజీవిని చీరాల నియోజకవర్గానికి పంపాలన్న నిర్ణయానికి లోకేష్ వచ్చినట్లు తెలిసింది.
చీరాల అయితే....
ఈ మేరకు గంజి చిరంజీవికి లోకేష్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. గంజి చిరంజీవి పద్మశాలి సామాజికవర్గం నేత. ఆయన సతీమణిది కాపు సామాజికవర్గం. ఈ కాంబినేషన్ చీరాలలో వర్క్ అవుట్ అవుతుందని లోకేష్ భావిస్తున్నారు. గతంలోనూ పోతుల సునీతను చీరాలకు పంపినా ప్రయోజనం లేదు. అయితే ఈసారి గంజి చిరంజీవిని చీరాలకు పంపితే అక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది.
కరణం వెళ్లిపోవడంతో....
ఇక్కడ లోకేష్ కు కూడా గంజి చిరంజీవి సామాజికవర్గం అండగా నిలుస్తుంది. చీరాలలో పద్మశాలిలు, కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువ. అక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన కరణం బలరాం వైసీపీ మద్దతుదారుగా మారిపోయారు. అక్కడ ఈసారి వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గంజి చిరంజీవిని చీరాలకు పంపి తాను మంగళగిరిలో మరోసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని లోకేష్ డిసైడ్ అయ్యారు.
- Tags
- nara lokesh
- tdp
Next Story