Tue Nov 26 2024 02:36:07 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటిపట్టునే లోకేష్.. రీజన్ అదే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ హైదరాబాద్ లోనే ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ హైదరాబాద్ లోనే ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపాలని నిర్ణయించుకున్న లోకేష్ పార్టీ కార్యక్రమాలకు ఇటీవల దూరంగా ఉంటున్నారు. ఈ నెల మొదటి నుంచి ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. అప్పడప్పుడు తనను కలవడానికి వచ్చిన నేతలు మినహా మరే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. దాదాపు నెల నుంచి ఆయన అమరావతికి దూరంగానే ఉన్నారు.
ఈ నెల 27 నుంచి...
లోకేష్ ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పాదయాత్ర అంటే ఒక నెలలో ముగిసిపోయేది కాదు. దాదాపు ఏడాదికి పైగానే పాదయాత్ర చేయనున్నారు. 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఆయన చేయబోతున్నారు. అంటే కుటుంబ సభ్యులకు ఏడాది పాటు దూరంగా ఉంటారు. అందుకోసమే ఆయన నెల నుంచి పార్టీ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని మరీ కుటుంబ సభ్యులతో గడపాలని నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబును పరామర్శించడానికి పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చిన సమయంలోనూ ఆయన కన్పించలేదు.
రాజకీయాలకు దూరంగా...
కొన్ని రోజులుగా ఆయన ట్వీట్లకు కూడా దూరంగానే ఉన్నారు. రాజకీయాలను మరిచి పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులకే వెచ్చిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఏడాది పాటు ఇంటికి దూరంగా ఉండటమంటే మామూలు విషయం కాదు. ఎండనక, వాననక ప్రజల్లోనే తిరగాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వారు పలుకరించేందుకు వచ్చినా హైదరాబాద్ లోని తన ఇంటికి మాత్రం ఏడాది తర్వాతనే లోకేష్ చేరుకుంటారు. అందుకోసమే ఆయన ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. సంక్రాంతి పండగ తర్వాత కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉంటారని తెలిసింది.
ఏడాది పాటు...
కుప్పం నియోజకవర్గం నుంచి ఈ నెల 27వ తేదీన మొదలయ్యే లోకేష్ పాదయాత్ర 2024 మార్చి మొదటి వారంలో ఇచ్ఛాపురంలో ముగిసే అవకాశముంది. లోకేష్ పాదయాత్ర కోసం ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పోలీసుల అనుమతికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆయన రోజుకు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. లోకేష్ రాత్రి బస ఏర్పాట్లు కూడా మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసేలా ముందుగా రూట్ ప్లాన్ రెడీ చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంటిపట్టునే ఈ పక్షం రోజులు లోకేష్ ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story