Tue Nov 26 2024 04:30:21 GMT+0000 (Coordinated Universal Time)
చినబాబు ట్రాక్ రికార్డు చెరిపేస్తారా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి.. రాజకీయాల్లో కూడా అంతే. ఎక్కడ ఓడిపోయామో అక్కడే మళ్లీ గెలవాలి. రాజకీయ నేతకు ఎవరికైనా అదే కోరిక. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అదే పంథాలో నడుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ఓటీటీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేశారు. తాను తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేస్తానని, ఈసారి తనను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఆయన ఈసారి గెలుస్తానన్న పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
ఓటమి పాలయి...
మంగళగిరిలో టీడీపీకి పెద్ద ట్రాక్ రికార్డ్ లేదు. 1985లో తొలి, చివరి సారి టీడీపీ మంగళగిరిలో గెలిచింది. అయితే ట్రాక్ రికార్డును చెరిపేసేందుకు నారా లోకేష్ 2019 ఎన్నికల్లో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దాదాపు ఐదు వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి పాలయ్యారు. రాజధాని ప్రాంతం కావడంతో తమకు అనుకూలంగా ఉంటుందని నారా లోకేష్ అక్కడ పోటీ చేశారు. అయినా ప్రజలు ఆదరించలేదు. ఇందుకు నారా లోకేష్ తొలినాళ్లలో కొంత ఇబ్బంది పడ్డారు. మరోసారి ఇక్కడ పోటీ చేయాలా? లేదా? అన్న ఆలోచనలో కూడా పడ్డారంటారు.
ప్రచారం జరిగినా...
ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని వివిధ నియోజకవర్గాల పేర్లు కూడా ప్రచారం లోకి వచ్చాయి. టీడీపీకి పట్టున్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా అన్నారు. దీనికి తోడు లోకేష్ పోటీ చేస్తానంటే తాము తప్పుకుంటామని అనేక మంది టీడీపీ నేతలు కూడా ప్రకటించారు. అయితే వాటన్నింటినీ పక్కన పెడుతూ నారా లోకేష్ తిరిగి మంగళగిరిలో పోటీ చేయాలనే నిర్ణయించుకున్నారు. గత కొన్నాళ్లుగా అక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం క్యాడర్ ను మాత్రమే కాకుండా ప్రజలతో సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేసేందుకు తరచూ పర్యటిస్తున్నారు.
ప్రజలత మమేకమై...
అన్న క్యాంటిన్, ఉచిత వైద్య పరీక్షల శిబిరాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కూడా ఈసారి మంగళగిరి నుంచి గెలవగలనన్న ధీమాతో ఉన్నారు. కొందరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన ప్రజలు తన వెంటే ఉంటారన్న విశ్వాసంతో ఉన్నారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలించే అంశం వైసీపీకి నష్టం చేకూరుస్తుందని, తనకు అనుకూలంగా మారుతుందని లోకేష్ విశ్వసిస్తున్నారు. ట్రాక్ రికార్డు చెరిపేయడానికే లోకేష్ నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. మంగళగిరిలో గెలిచి తనపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. మరి రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు కాని ఆయనైతే పోటీ చేయడానికే రెడీ అయ్యారు. అందుకు తగిన శ్రమపడుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి మరి.
Next Story