Fri Nov 22 2024 13:42:55 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాప్ లో టీడీపీ అలా పడిపోతుందేంటి?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ సీరియస్ గానే రియాక్ట్ అయింది.
తెలుగుదేశం పార్టీ హడావిడి ఆ కొద్దిరోజులకే పరిమితమవుతుంది. తర్వాత మళ్లీ మామూలవుతుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం చేస్తామని ఆర్భాటంగా ప్రకటించే టీడీపీ నాయకత్వం తర్వాత దాని ఊసే ఎత్తడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ రెండు రోజులు సీరియస్ గానే రియాక్ట్ అయింది. స్వయంగా చంద్రబాబు గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేసి వచ్చారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత తమ్ముళ్లు దాని ఊసే మరచిపోయారు.
చివర వరకూ...
ఏ సమస్య అయినా చివర వరకూ పోరాటం చేయాల్సిన రాజకీయ పార్టీ రెండు రోజులకు మించి వారిలో కసి కనిపించడం లేదన్న ఆరోపణలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించినా, ఎక్కడా ఆ అలజడి లేదు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా జిల్లాలకు ఎటువంటి ఆదేశాలు వెళ్లకపోవడంతో జిల్లా నేతలు కూడా ఆ అంశాన్ని పూర్తిగా మర్చిపోయినట్లే కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విషయం దాదాపు తెరమరుగయినట్లే. పేరు మార్పిడిపై తాము కేంద్రం ప్రభుత్వం దృష్టికి వెళతామని, న్యాయపోరాటం చేస్తామని చెప్పిన పార్టీ తర్వాత పట్టించుకోకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది.
వైసీపీ ట్రాప్ లో...
వైసీపీ ప్రభుత్వం ట్రాప్ లో టీడీపీ పడిపోతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఒక అంశం నుంచి డైవర్ట్ చేసేందుకు మరో అంశాన్ని తెరపైకి తీసుకు వస్తుండటంతో పోలో మంటూ తెలుగు తమ్ముళ్లు దాని వెంట పరుగులు తీస్తున్నారు. దీంతో అసలు అంశం మరుగున పడిపోతుంది. దీని వల్ల వైసీీపీ సేఫ్ జోన్ లోకి వెళుతుంది. నిజానికి ఎన్టీఆర్ పేరు తొలగింపు అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా నిర్వహిస్తామని సాక్షాత్తూ చంద్రబాబు చెప్పారు. అయితే మూడు రాజధానుల అంశం, వికేంద్రీకరణ, విశాఖలో గర్జన అంటూ వైసీపీ డైవర్ట్ చేయగానే అటువైపునకు తమ్ముళ్లు దిగిపోయారు. దసపల్లా భూముల కుంభకోణం అంటూ మరికొందరు మీడియా సమావేశాలు పెట్టి మ..మ అనిపిస్తున్నారు.
ఎన్టీఆర్ పేరు మార్పిడి...
దీంతో ఎన్టీఆర్ పేరు మార్పిడి విషయం పూర్తిగా మరుగునపడిపోయింది. దాని మీద పోరాటాలు లేవు. ప్రెస్ మీట్లు లేవు. వైసీపీ ఇందులో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఏది కొత్త అంశం కనిపిస్తే దాని వెనక బడటం తప్పించి తమకు పనికి వచ్చే అంశాన్ని లైవ్ లో ఉంచాలన్న ధ్యాస నాయకులకు లేకుండా పోయింది. దీంతో ఎన్టీఆర్ ఇష్యూ ఇక ఏపీలో వినపడటం లేదు. కన్పించడం లేదు. ఇప్పుడంతా రాజధాని అంశంపైనే నడుస్తుంది. ఇలా అయితే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఎలా వస్తుందన్న ప్రశ్నలు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. అమరావతి కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని సవాల్ విసరగానే దానిపైన ఇప్పుడు టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Next Story