Mon Dec 23 2024 18:04:35 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకో ఏమో.. అచ్చెన్న ఇలా?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్నారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి దూకుడు ప్రదర్శించడం లేదు. ఆయనను చంద్రబాబు పక్కన పెట్టినట్లే కన్పిస్తున్నా పూర్తిగా కాదన్నది పార్టీ నేతలు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు అసలు పార్టీ అధ్యక్షుడా? కాదా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అచ్చెన్నాయుడుకు ఫోన్ చేయాలన్నా టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. ఆయనకు ఫోన్ చేస్తే తమ భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
అరెస్ట్ కావడంతో....
అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఏపీ సీఐడీ పోలీసులు ఆయనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారంటూ ఆయనపై పార్టీలో కొంత సానుభూతి ఏర్పడింది. దీంతో చంద్రబాబు కూడా అదే జిల్లాకు చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి అచ్చెన్నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఆయన కొంత దూకుడుతో ఉన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై అచ్చెన్నాయుడి చేత చంద్రబాబు వేటు వేయించారు కూడా.
ఆ వ్యాఖ్యలతోనే.....
ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు పార్టీ లేదు.. బొక్కా లేదు అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచే అచ్చెన్నాయుడుకు పార్టీలో ఇబ్బందిగా మారింది. ఆ సాకుతో ఆయనను తొలగించలేరు. అలాగని పూర్తిగా ఆయనపైనే పార్టీ బాధ్యతలను అప్పజెప్పలేరు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన జిల్లాలను ఇప్పటి వరకూ పర్యటించింది లేదు. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానం ఉన్నా ఆయననను చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
అప్పటి నుంచి....
ముఖ్యమైన సంఘటనల్లోనూ అచ్చెన్నాయుడు భాగస్వామ్యం లేకుండానే చంద్రబాబు పని కానిచ్చేస్తున్నారట. గుడివాడ క్యాసినో నిజ నిర్ధారణ కమిటీ, ఇన్ ఛార్జిల నియామకం విషయంలో అచ్చెన్న పాత్ర లేకుండా చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అసలు అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి మాట్లాడాలన్నా నేతలు జంకుతున్నారట. అచ్చెన్నతో మాట్లాడితే ప్రయారిటీ ఉండదని నేతలు భయపడిపోతున్నారు. అచ్చెన్నాయుడు సయితం ఏదో ఉన్నానన్నట్లుగా ప్రకటనలు చేస్తూ ఉత్సవ విగ్రహంలా మారిపోయారు. జగన్ కు లేఖలు రాసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు.
- Tags
- achennaidu
- tdp
Next Story