Sat Dec 21 2024 09:57:17 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్న .. అవసరం అంతవరకేనట
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తన సొంత జిల్లా శ్రీకాకుళంలో తప్ప ఎక్కడా పర్యటించలేని పరిస్థితి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆయన తన సొంత జిల్లా శ్రీకాకుళంలో తప్ప ఎక్కడా పర్యటించలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడులను జరుపుతున్నారు. కానీ అందులో అచ్చెన్నాయుడుకు మాత్రం స్థానం లేదు. జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు హాజరవుతున్నారు కదా? ఇక రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అని అనుమానం రావచ్చు. కానీ జిల్లాల పర్యటనలను అచ్చెన్నాయుడును దూరంగా ఉంచుతున్నారన్న టాక్ నడుస్తుంది.
కేసులో అరెస్ట్ అయి..
అచ్చెన్నాయుడు అప్పుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ కాకపోతే అధ్యక్షుడు అయ్యేవారు కాదన్నది పార్టీలోనే అందరూ అంగీకరించే విషయం. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించి అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న కళా వెంకట్రావును తప్పించి అచ్చెన్నాయుడుకు ఇచ్చారు. నిజానికి లోకేష్ కు ఆ పదవిని అచ్చెన్నాయుడుకు ఇవ్వడం ఇష్టంలేదు. బీద రవిచంద్ర పేరు లోకేష్ సూచించినా కేసుల్లో అరెస్టయిన అచ్చెన్నాయుడును టీడీపీ అధ్యక్షుడిని చేస్తే రాజకీయంగా మైలేజీ వస్తుందని చంద్రబాబు భావించారు.
అప్పటి నుంచే...
అయితే అచ్చెన్నాయుడు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో ఆయనను పార్టీ అధినేత పూర్తిగా పక్కన పెట్టింది. చంద్రబాబు మినీమహానాడుకు హాజరవుతున్నారు. పోనీ అక్కడ అచ్చెన్నాయుడుకు అవకాశం ఇవ్వలేదనుకుందాం. కానీ నియోజకవర్గాల సమీక్షల్లోనైనా అచ్చెన్నాయుడుకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా? అన్న చర్చ జరుగుతోంది. మినీ మహానాడుల పేరుతో జిల్లాలకు వెళుతున్న చంద్రబాబు అక్కడ నియోజకవర్గాల వారీగా సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గాల సమీక్షలకు...
నో డౌట్.. చంద్రబాబు డెసిషన్ ఫైనల్. ఆయన సమీక్ష చేస్తారు. నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి నియోజకవర్గ వేదికలపై చోటు కల్పించకపోవడంపై పార్టీలోనే చర్చ జరుగుతుంది. అచ్చెన్నను ఒక జిల్లాకు పరిమితం చేయడం మినహా మరేదీ చేయడం లేదు. మొన్న మోదీ సభకు భీమవరం పంపినా అది చంద్రబాబుకు ఆహ్వానం లేకనే. అందుకే అచ్చెన్నాయుడు పార్టీ అధినాయకత్వంపై ఒకింత ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కానీ వేరే దారిలేదు. కళా వెంకట్రావు మాదిరి సర్దుకుపోతేనే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. మొత్తం మీద అచ్చెన్నను పార్టీ అవమానిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Next Story