Sat Nov 16 2024 17:55:41 GMT+0000 (Coordinated Universal Time)
అవును.. బాబు మారారు.. ఇది నిజం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా మారారు. ఆయనలో గతంలో ఎన్నడూ కనిపించని కోణాలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా మారారు. ఆయనలో గతంలో ఎన్నడూ కనిపించని కోణాలు కనిపిస్తున్నాయి. గతంలో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలా ఉండేవారు కాదు. ఆయన పార్టీని బలోపేతం చేయడానికి నాయకుల మీదనే ఎక్కువగా ఆధారపడే వారు. కానీ గత మూడేళ్లలో ఆయనకు కార్యకర్తల బలం, శక్తి అవగతమయింది. అందుకే ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్వయంగా తానే హాజరవుతున్నారు.
పాడె మోసి....
నిన్న మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రయ్య హత్య విషయంలోనూ చంద్రబాబు వెంటనే స్పందించారు. అక్కడకు వెళ్లారు. చంద్రయ్య పాడె మోశారు. ఇది చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు, క్యాడర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడమే కాకుండా 25 లక్షల పరిహారాన్ని కూడా పార్టీ తరుపున చంద్రబాబు ప్రకటించారు.
పదేళ్ల పాటు....
2004 నుంచి 2014 వరకూ చంద్రబాబు ప్రతిపక్షంలోనే ఉన్నారు. వైఎస్ అధికారంలో ఉన్నారు. కానీ పదేళ్లలో ఆయన ఎప్పుడూ ఇలా కార్యకర్తల వద్దకు నేరుగా వెళ్లలేదు. ఆయన దృష్టంతా పార్టీని బలోపేతం చేయడంపైనే ఉండేది. పాదయాత్ర చేయాలా? అధికార పార్టీని విమర్శించడంతో ప్రజలను ఆకట్టుకోవచ్చన్న భావనతో ఉండేవారు. విపక్షంలో ఉన్నా నేతలను కలిసేందుకు ఇష్టపడే వారు కాదు. ఆయనంతట ఆయన పిలిస్తే తప్ప పదేళ్ల పాటు నేతలు ఆయన అపాయింట్ మెంట్ కోరి దక్కించుకున్నది అది కొద్దిమంది అనే చెబుతారు.
కానీ ఇప్పుడు....
కానీ ఇప్పుడు పూర్తిగా మారింది. కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి చంద్రబాబు శ్రమిస్తున్నారు. పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించేది నేతలు కాదని, కార్యకర్తలు అని ఆయన ఈ రెండున్నరేళ్లలో గ్రహించినట్లుంది. అందుకే ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే వెళ్లి బాధితులను ఓదారుస్తున్నారు. ఇక నేతల మాట విననని, కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ఆయనలో మార్పును చూసి సిీనియర్ నేతలు సయితం విస్తుపోతున్నారు.
Next Story