Sat Nov 23 2024 00:09:43 GMT+0000 (Coordinated Universal Time)
బాబు మళ్లీ ఢిల్లీ యాత్ర... సీన్ మారుతుందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పయనమవుతున్నారు. ఆయన వచ్చే వారంలో ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పయనమవుతున్నారు. ఆయన వచ్చే వారంలో ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. ఢిల్లీకి దూరమవ్వడంతో చంద్రబాబు రాజకీయంగా చాలా కోల్పోయానని ఫీలవుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెడుతున్నారంటే ఇతర పార్టీల నేతలు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడా పరిస్థిితి లేదు. ఇటు అధికార బీజేపీ, అటు విపక్ష యూపీఏ నేతలు కూడా చంద్రబాబును పెద్దగా పట్టించుకోవడం లేదు. కలిసినప్పుడు పలకరింపులే కాని చంద్రబాబు అంటూ ఒకరున్నారన్న విషయాన్ని కూడా వారు గుర్తుంచుకోవడం లేదు.
నమ్మేపరిస్థితి లేక...
ఇటీవల మమత బెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబాబుకు పిలుపు లేదు. ఆయన మోదీకి మద్దతుగా ఉన్నాడని అనుకున్నా, జగన్ కు రాసిన లేఖ చంద్రబాబుకు రాయకపోవడం కొంత వాల్యూను తగ్గించడమే అవుతుంది. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టి, ఢిల్లీలో రాహుల్ తో కలసి నడిచిన చంద్రబాబుకు ఆ పార్టీ నుంచి కూడా పిలుపులు లేవు. అంటే చంద్రబాబును ఏ పార్టీ నమ్మే పరిస్థితి ఢిల్లీలో కనిపించడం లేదు. ఇది ఒకరకంగా ఆయన స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. రెండుసార్లు వరసగా ఓడిపోయిన అఖిలేష్ యాదవ్ కు ఇచ్చిన విలువ కూడా పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు లేకుండా పోయింది.
వైసీపీని తట్టుకోవాలంటే...
అయితే ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాని మోదీతో కరచాలనం చేసిన తర్వాత మళ్లీ చంద్రబాబులో ఆశలు చిగురించాయి. బీజేపీతో మరోసారి సయోధ్యతతో కొనసాగేందుకు ఢిల్లీకి వెళుతున్నారు. మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైనా రావచ్చు అన్న మోదీ పిలుపును పురస్కరించుకుని వచ్చే వారంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఆయనకు అత్యవసరం. అది ఉంటేనే క్యాడర్ నుంచి నేతల వరకూ పరుగులు పెడతారన్న అంచనాలో ఉన్నారు.
ఫిర్యాదు చేసి....
అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం, దాడులకు పాల్పడటం, కేంద్ర ప్రభుత్వ పథకాలను తాను ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం, విపరీతమైన అప్పులు చేయడం, ఉచిత పథకాల వంటివి మోదీ దృష్టికి తేవాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెలలోనే చంద్రబాబు హస్తిన పర్యటన ఉండే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మోదీతో మీట్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా.
Next Story