Mon Dec 23 2024 11:47:29 GMT+0000 (Coordinated Universal Time)
దూరితే అల్లుకుపోరూ.. అందుకే దూరంగా ఉంచారా?
చంద్రబాబు బీజేపీతో ఎంత సయోధ్యకు ప్రయత్నిస్తున్నా బీజేపీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు
చంద్రబాబును అల్లూరి శత జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు ఆహ్వానించలేదు? టూరిజం శాఖ మంత్రి కిషనర్ రెడ్డి ఫోన్ చేసి పార్టీ ప్రతినిధిని మాత్రమే ఎందుకు పంపమన్నారు? వీటన్నింటికీ సమాధానం వెతుక్కునే పనిలో టీడీపీ పడింది. నిజానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనను ఆహ్వానించి ఉంటే చంద్రబాబు ఖచ్చితంగా భీమవరానికి వెళ్లి ఉండేవారు. ఏ అవకాశాన్ని ఆయన విడిచిపెట్టరు.
ప్రతినిధి పంపాలంటూ...
అందునా మోదీ పాల్గొనే సభకు తనను ఆహ్వానిస్తే వెళ్లి ఆయనతో కరచాలనం చేసి గ్యాప్ ను తగ్గించుకుని వచ్చే ఆలోచన చంద్రబాబుది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు ఆహ్వానం అందలేదు. చిరంజీవిని పిలిచి ప్రతిపక్ష నేతను పిలవకుండా పార్టీ నుంచి ప్రతినిధిగా పంపమని ఎందుకు కోరారు. మోదీకి చంద్రబాబు మొహం చూడటం ఇష్టంలేకనే చంద్రబాబును పక్కన పెట్టారా? అన్న సందేహం కూడా తలెత్తుతుంది.
మోదీపై వ్యక్తిగత విమర్శలు...
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన కుటుంబ ప్రస్తావన కూడా చంద్రబాబు తెచ్చారు. అందుకే చంద్రబాబుతో వేదిక పంచుకోవడం మోదీకి ఇష్టం లేదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించలేదని చెబుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ లభించలేదు. అమిత్ షా ను కూడా కలవలేకపోయారు. మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నా వారు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న సమాచారం.
అందుకే అలా చేశారా?
చంద్రబాబు బీజేపీతో ఎంత సయోధ్యకు ప్రయత్నిస్తున్నా బీజేపీ ఏ మాత్రం సడలింపులు ఇవ్వడం లేదు. రాష్ట్ర బీజేపీలో కొందరు తప్పించి చంద్రబాబుతో పొత్తుకు ఎక్కువ మంది విముఖత చూపుతున్నారు. చంద్రబాబుకు మోదీని కలిసే ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయన అల్లుకుపోతాడని రాష్ట్ర బీజేపీ నేతలు కూడా భావించి ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా చంద్రబాబును ఆహ్వానించకపోవడమే మంచిదని సూచన చేసి ఉండవచ్చు. అమిత్ షా కూడా చంద్రబాబు విషయంలో కిషన్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చి ఉండవచ్చు. అందుకే చంద్రబాబును ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచారు.
Next Story