Thu Dec 19 2024 17:44:36 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి నాని వర్సెస్ టీడీపీ.. డిష్యూం.. డిష్యూం...గుడివాడలో టెన్షన్ టెన్షన్
తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని గుడివాడలో పోలీసులు అడ్డుకున్నారు
తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని గుడివాడలో పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడలోని టీడీపీ కార్యాలయం నుంచి కమిటీ సభ్యులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య ఉందని, కమిటీ పరిశీలనకు పోలీసులు అనుమతి లేదని వారు చెప్పారు. గుడివాడ టీడీపీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న టీడీపీ నేతలను, కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొడాలి నాని కేసినో వ్యవహారంపై నిజానిజాలను తేల్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ గుడివాడలో పర్యటించాలనుకుంది.
ఇరు వర్గాలు....
అయితే ఇదే సమయంలో కొడాలి నాని కేసినో నిర్వహించారని చెబుతున్న కే కన్వెన్షన్ కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కే కన్వెన్షన్ కు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అక్కడకు వెళితే రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశముందని భావించిన పోలీసులు కమిటీ సభ్యులను టీడీపీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వడం లేదు. కొందరు టీడీపీ కార్యాలయంపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ ఛార్జిని నిర్వహించారు. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, తంగిరాల సౌమ్య, నక్కా ఆనంద్ బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమ కారు ధ్వంసమయింది.
Next Story