Fri Nov 22 2024 23:46:23 GMT+0000 (Coordinated Universal Time)
భయపెడుతున్నారా? భయపడిపోతున్నారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లో నిస్సహాయత కన్పిస్తుంది. అదే సమయంలో ఫ్రస్టేషన్ కూడా పీక్ కు చేరుకుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లో నిస్సహాయత కన్పిస్తుంది. అదే సమయంలో ఫ్రస్టేషన్ కూడా పీక్ కు చేరుకుంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామన్న దైన్యస్థితిలో చంద్రబాబు ఉన్నారు. నిజమే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన చంద్రబాబుకు జగన్ అసలు మింగుడు పడటంలేదు. కొరుకుడు పడటం లేదు. తన వ్యూహాలకు జగన్ చిక్కడమూ లేదు.
ఫలితాలు....
కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది మరో రెండు రోజుల తర్వాత కాని తెలియదు. కానీ ఓడిపోతామన్న భయం, బెంగ చంద్రబాబు ముఖంలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఎన్నికల్లో తాము ఏం చేయలేమన్న భావనకు ఆయన వచ్చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చంద్రబాబు ఆపసోపాలు పెడుతున్నారు. తాను అధికారంలో ఉండగా చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాదు. అలాగే ప్రజలూ ఆయనకు కనపడరు.
ప్రజాస్వామ్యం....?
ఇప్పుడు ప్రజలంతా రోడ్లెక్కి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని చంద్రబాబు పిలుపునిస్తుండటం నవ్వు తెప్పిస్తుంది. నంద్యాల ఉప ఎన్నికలో అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న వారికి అండగా అన్ని వ్యవస్థలు ఉంటాయి. సహకరించని వ్యవస్థను కాదు పొమ్మంటారు కూడా. చంద్రబాబు కాని, జగన్ కానీ ఆ సూత్రంలో మార్పు ఉండదు. పాలకుల మనస్తత్వం కూడా అదే తీరున ఉంటుంది. కానీ అధికారం కోల్పోయినప్పుడే చంద్రబాబుకు అన్ని వ్యవస్థలు గుర్తుకు వస్తాయి.
దారులు మూసుకు పోవడంతో.....?
చంద్రబాబుకు ఇటు కేంద్రంలో బీజేపీతో కలసి నడిచేందుకు కూడా దారులు దొరకడం లేదు. కనీసం ఆ ప్రయత్నం ఫలించినా జగన్ ను కొంత కట్టడి చేసే అవకాశముండేది. కానీ ఆ ఛాన్స్ కూడా ఇప్పట్లో దొరికేలా లేదు. అందుకే చంద్రబాబు తాను భయపడుతూనే వైసీపీని భయపెట్టే విధంగా వార్నింగ్ లు ఇస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు కుప్పం ఎన్నికల విషయంలో మాత్రం ఫ్రస్టేషన్ కు గురవుతున్నారనే చెప్పాలి.
Next Story