శబరిమల మరోసారి ... స్వామియే శరణం !!
ప్రశాంతంగా వుండే శబరిమల సన్నిధానం లో మరోసారి ఆందోళనలు మొదలు కానున్నాయి. గత నెలలో వారం రోజుల పాటు సన్నిధానం తెరవగానే మహిళలకు అయ్యప్ప భక్తులకు తీవ్రమైన వార్ సాగింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అగ్గి రాజేయడం తో మహిళాభక్తులు ఎలాగైనా ఆలయంలోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్రయత్నాన్ని అయ్యప్ప భక్తులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో ఘర్షణలు చెలరేగాయి. పౌరహక్కుల సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులకు అయ్యప్ప భక్తులకు నడుమ సాగుతున్న ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. దాంతో భారీ భద్రతను శబరిమల వద్ద కేరళ సర్కార్ ఏర్పాటు చేసింది.
నేటి నుంచి సన్నిధానం ...
మండల దీక్షల్లో భాగంగా సన్నిధానం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెరిచారు. ఈ నేపథ్యంలో 14 వందల మంది పోలీస్ దళంతో పాటు ప్రత్యేక ర్యాపిడ్ యాక్షన్ దళాలను రంగంలోకి దింపింది కేరళ సర్కార్. సుప్రీం ఆదేశాలను పాటిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. పంబ నుంచి సన్నిధానం చేరుకునే అన్ని మార్గాలను పోలీసు బలగాల పర్యవేక్షణలో ఉంచింది. ఇదిలా ఉండగా సమానత్వ హక్కు సాధించుకు తీరుతామంటూ మహిళా సంఘం నేతలు వివిధ ప్రాంతాలనుంచి శబరిమల చేరుకున్నట్లు సమాచారం.
ఇంటలిజెన్స్ వర్గాలు.....
వీరంతా స్థానిక లాడ్జీలలో ఇప్పటికే బస చేశారని ఎలాగైనా అయ్యప్పను దర్శించుకోవడానికి వీరంతా వ్యూహాత్మకంగా బయల్దేరతారని ఇంటిలిజెన్స్ కి సమాచారం అందింది. మరోవైపు మీడియా కు పలు ఆంక్షలను పోలీసులు విధించడంతో శబరిమల లో హైటెన్షన్ నెలకొనివుంది. రేపు సాయంత్రం వరకూ ఆలయం తెరుచునే ఉంటుంది. దీంతో మహిళలు రాకుండా అయ్యప్ప భక్తులు అడ్డుకునే అవకాశముంది. వీరికి పోలీస్ లు ఏ మేరకు రక్షణ కల్పిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.