పదో క్లాసులోనే పిచ్చి ముదిరింది..?
చదివేది టెన్త్ క్లాస్ మాత్రమే. ఇద్దరు బాయ్స్ కి ఒక లవర్ . అది తక్కువైందనుకుంటే ఇద్దరు మద్యం సేవించడం. అది కూడా తక్కువే తాగి తిన్నంగా ఉండక తమ లవర్ కోసం కొట్టుకుని ఒకరిపై మరొకరు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని కన్నవారికి గంపెడు శోకం మిగిల్చారు ఆ చిన్నారులు. ఇది తల్లి తండ్రులకు ఒక గుణపాఠం చెప్పే సంచలన సంఘటనే. విచ్చలవిడి స్వేచ్చకు పిల్లలను అనుమతిస్తే జరిగే ఉపద్రవాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది తాజాగా జరిగిన ఈ దుర్ఘటన. విలువలు నేర్పని విద్యను, విచ్చలవిడి గా సాగుతున్న మద్యం అమ్మకాలను ప్రశ్నిస్తుంది ఈ ఘోరం.
అమ్మాయి కోసం ...
తెలంగాణలోని జగిత్యాలకు చెందిన మహేంద్ర, రవితేజ మిత్రులే. ఇద్దరు పదవతరగతి చదువుతున్నారు. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఎవరికీ వారే తనకే ఆ అమ్మాయి దక్కాలన్న ఆలోచనతో వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు జగిత్యాల మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో చెట్లతో దట్టంగా వుండే ప్రాంతానికి వెళ్ళి మందు కొట్టారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దాంతో ఆగ్రహంతో ఒకరిపై మరొకరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది కథ కాదు చిన్నారుల్లో ప్రమాదకర ధోరణి పెరుగుతున్న తీరుకు సూచిక. దీనిపై ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలు పెట్టారు. పిల్లల తల్లితండ్రులు ఇప్పుడు ఏమైందో తెలియక తమ చిన్నారులు కట్టెల ముందు తల్లడిల్లుతున్నారు. అంతా అయిపోయాక ఏమిటి ప్రయోజనం ప్రతి తల్లితండ్రి పిల్లల మానసిక వికాసం వారు వేస్తున్న అడుగులు పూర్తిగా రెక్కలు వచ్చే వరకు పర్యవేక్షించక పోతే సమాజానికే ప్రమాదమని గుర్తించాలి.