ఆ రూపం.. దివ్య రూపం
అయోధ్యలో నేడు కొలువు తీరి, భక్తుల పూజలు అందుకోనున్న బాల రాముడి విగ్రహాన్ని అద్భుతమైన రీతిలో తయారు చేశారు. రామ మందిరంలో ప్రతిష్ట కోసం మూడు విగ్రహాలను తయారు చేయించారు. వాటిలో అత్యుత్తమైన దానిని ఎన్నుకోవడం కోసం గత ఏడాది డిసెంబర్ 29న ఓటింగ్ నిర్వహించారు
అయోధ్యలో నేడు కొలువు తీరి, భక్తుల పూజలు అందుకోనున్న బాల రాముడి విగ్రహాన్ని అద్భుతమైన రీతిలో తయారు చేశారు. రామ మందిరంలో ప్రతిష్ట కోసం మూడు విగ్రహాలను తయారు చేయించారు. వాటిలో అత్యుత్తమైన దానిని ఎన్నుకోవడం కోసం గత ఏడాది డిసెంబర్ 29న ఓటింగ్ నిర్వహించారు. రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రాముడి విగ్రహానికి ఎక్కువ మంది ఓటేశారు. దీంతో కోట్లాది మంది భక్తుల పూజలు అందుకోడానికి బాలరాముడి రూపు సిద్ధమైంది.
దాదాపు 150 నుంచి 200 కిలోల బరువున్న రామ్ లల్లా 51 ఇంచీలు పొడవుతో అలరిస్తూ ఉంటుంది. 30 అడుగుల నుంచి చూసినా భక్తులకు స్పష్టంగా కనిపించే దూరంలో విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. పురాతన నల్లరాతి నుంచి బాల రాముడిని రూపొందించారు. ఐదేళ్ల వయసుండే రాముడి రూపంలో విగ్రపం ఉంటుంది.. కుడి చేయి భక్తులకు వరద హస్తాన్ని సూచించడమే కాకుండా, బాణం సంధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంటుంది. ఎడమ చేయి విల్లును పట్టుకున్నట్లు ఉంటుంది. రాముడి కుడి కాలు దగ్గర హనుమంతుడి విగ్రహం, ఎడమ కాలు వద్ద గరుడిడి విగ్రహాలు ఉంటాయి. విగ్రహంచుట్టూ విష్ణుమూర్తి దశావతారాలనూ చిత్రించారు. తల దగ్గర ఓమ్, స్వస్తిక్ చిహ్నాలను పొందుపరిచారు. శంఖు చక్రాలు, గద కూడా విగ్రహంలో భాగంగా ఉంటాయి.
హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాల రాముడి విగ్రహ ప్రతిష్ట మరి కొద్ది సేపట్లో జరగబోతోంది. రామమందిరానికి శంకుస్థాపన చేసిన మోదీ చేతులమీదుగానే ప్రాణ ప్రతిష్ట కూడా జరగడం విశేషం.