Fri Nov 15 2024 22:02:39 GMT+0000 (Coordinated Universal Time)
నాని జగన్ వద్దకు ఇక వెళ్లడట.. నిజమేనా?
జిల్లా వైసీపీ ప్లీనరీలో పేర్ని నాని వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది
మాజీ మంత్రి పేర్ని నాని అసంతృప్తితో ఉన్నారా? తనను మంత్రి వర్గం నుంచి తప్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా? లేక తన స్థానంలో జోగి రమేష్ కు ఇచ్చినందుకు అసహనంతో ఉన్నారా? లేక ఎంపీ బాలశౌరి విషయంలో హైకమాండ్ తనను తప్పుపట్టిందని గుర్రుగా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆయన వ్యవహార శైలితోనే అర్థమవుతుంది. గత కొంతకాలంగా పేర్ని నాని పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం తప్పించి ఆయన పెద్దగా పార్టీలో యాక్టివ్ గా లేరు.
వైఎస్ విగ్రహానికి...
జిల్లా వైసీపీ ప్లీనరీలో ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. జిల్లా అధ్యక్షుడిగా ప్లీనరీకి హాజరైన పేర్ని నాని సమావేశానికి ముందు వైఎస్ విగ్రహానికి దండ వేయడానికి నిరాకరించారు. నిజానికి వైఎస్ వల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానని అనేకసార్లు పేర్ని నాని బహిరంగంగానే చెప్పారు. మిగిలిన నేతలు చెబుతున్నా ఆయన పట్టించుకోనట్లే వ్యవహరించారు. ఆయనను బలవంతం పెట్టడం ఇష్టం లేక నేతలే వెనక్కు తగ్గారు. దీంతో పేర్ని నాని పార్టీ అధినాయకత్వంపై కొంత ఆగ్రహంతో ఉన్నారని స్పష్టంగా కనపడుతుంది.
బాలశౌరి వివాదం...
జగన్ ముందుగానే మంత్రి పదవి రెండున్నరేళ్లు అని మాత్రమే చెప్పారు. కానీ మూడేళ్లు కొనసాగించారు. నో డౌట్ పేర్ని నాని ప్రభుత్వానికి అండగా నిలిచారు. సమాచారశాఖ మంత్రిగా ఆయన సమర్థవంతంగా వ్యవహరించారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలోనూ, ప్రజలకు అర్థమయ్యేలా సమస్యలను వివరించడంలోనే పేర్ని నాని తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు. స్మూత్ గానే చురకలు అంటిస్తూ, సెటైర్లు వేస్తూ అవతలి వారి గాలి తీసే పేర్నినాని మీడియా సమావేశాలు హైలెట్ అనే చెప్పుకోవాలి.
కుమారుడిని....
తనను జగన్ మంత్రి పదవిలో కొనసాగిస్తారని పేర్ని నాని భావించి ఉండవచ్చు. ఆ కారణం కాకపోయినా ఎంపీ బౌలశౌరి విషయంలో తనను తప్పుపట్టడం నాని జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. అందుకే మంత్రి పదవి నుంచి తప్పుకున్నాక జగన్ ను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని చెప్పేశారు. తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని బరిలోకి దింపుతారంటున్నారు. నానిది అప్పుడే రాజకీయాల నుంచి తప్పుకునేంత వయసు కాదు. ఆయన మరో రెండు దఫాలు పోటీ చేసే అవకాశం, సత్తా ఉన్న నేత. ఆయన పార్టీ హైకమాండ్ వైఖరి నచ్చకే పోటీ చేయనని చెప్పేశారన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. మరి పేర్ని నాని చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి.
Next Story