Mon Dec 23 2024 08:19:30 GMT+0000 (Coordinated Universal Time)
డేంజర్ జోన్ లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు
వైసీపీలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు దాదాపు 66 మంది ఉన్నారు. వీరిలో కొందరు డేంజర్ జోన్ లో ఉన్నారు
వైసీపీలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు దాదాపు 66 మంది ఉన్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను కొత్త వారిని ఎంపిక చేయడంతో జగన్ గత ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. వారి పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు తిరిగి లభించే అవకాశముంది. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తెలియడంతో వారికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. వారి పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. వారు మారకుంటే టిక్కట్లు దక్కడం కష్టమేనంటున్నారు.
ఫస్ట్ వార్నింగ్....
పనితీరును మార్చుకోవాలని జగన్ ఇప్పటికే కొందరికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలపై అసంతృప్తి నెలకొంది. వీరికి ఇప్పటికే హెచ్చరికలు అధిష్టానం నుంచి అందాయి. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మొదలు కావడంతో రానున్న కాలంలో పనితీరు మార్చుకోవాల్సిందిగా సూచనలు అందినట్లు చెబుతున్నారు.
వీరందరికీ కష్టమే.....
కొన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణాలు, పార్టీలో అసంతృప్తుల నేపథ్యంలో దృష్ట్యా కొందరికి మరోసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదని అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, కర్నూలు జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, గుంటూరు జిల్లాలోని తాడికొండ, పొన్నూరు, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, విశాఖ జిల్లాలోని పాడేరు, గాజువాక, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట వంటి చోట్ల అభ్యర్థు మార్పు ఖాయమంటున్నారు. వీరంతా డేంజర్ జోన్ లో ఉన్నట్లే. రానున్న కాలంలో వీరు పనితీరును మార్చుకుని, పార్టీలో ఉన్న అసంతృప్తులను తొలగించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో వీరందరికీ టిక్కెట్లు దక్కడం కష్టమేనన్న టాక్ పార్టీ నుంచి విన్పిస్తుంది.
క్యాడర్ కు దూరమై....
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వీరు ఆశించిన తీరులోనే పనిచేస్తున్నా ప్రజల నుంచి పెద్దగా వీరికి స్పందన రావడం లేదంటున్నారు. పలుమార్లు జరిపిన సర్వేల్లోనూ వీరే వెనకబడి ఉండటాన్ని జగన్ గమనించారట. వీరంతా తొలిసారి ఎమ్మెల్యే అయినా కార్యకర్తలతో కలివిడిగా పనిచేయకపోవడంతో అక్కడ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందన్న రిపోర్టులు వచ్చాయి. 2012 నుంచి ఆ నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ దూరమయిపోతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గాల క్యాడర్ తో వచ్చే నెల 4 వతేదీ నుంచి జగన్ నేరుగా ఇంట్రాక్ట్ అవ్వాలని నిర్ణయించారని చెబుతున్నారు. మొత్తం మీద తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మందికి ఈసారి టిక్కెట్లు దక్కడం కష్టమేనన్నది వాస్తవమని పార్టీ సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.
Next Story