Mon Dec 23 2024 13:41:36 GMT+0000 (Coordinated Universal Time)
లెక్కలోకి తీసుకుంటారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్టీపీని ప్రజలు ఆదరించడంపై అనేక అనుమానాలున్నాయి
తెలంగాణలో రెండు పార్టీలు ఎందుకున్నాయి? అవి వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చేస్తాయి? కనీసం తమ సంప్రదాయ ఓటర్లయినా ఈ పార్టీలకు అండగా నిలుస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ. మరొకటి వైఎస్సార్టీపీ. రెండు పార్టీలు తెలంగాణలో స్పీడ్ పెంచాయి. ఎన్నికలు వస్తున్న సమయంలో ఈ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? లేదా పక్కన పెడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీలు పూర్వనేతలపైన ఆధారపడి తెలంగాణలో రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఏదో ఒకటి చేసి నిరూపించుకోవాలని పరితపిస్తున్నాయి. కనీస స్థానాలను దక్కించుకోవాలని కృషి చేస్తున్నాయి. కాని వాటి శ్రమ ఫలిస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్.
ఎన్టీఆర్ ఓటు బ్యాంక్ అట... హ్హ..హ్హ..హ్హ...
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల తెలుగుదేశం పార్టీ మళ్లీ స్పీడ్ పెంచింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించిన తర్వాత నిధులకు లోటు లేకపోవడంతో కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నెల 26 నుంచి మినీ మహానాడుల పేరిట పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేసింది. ఈనెల 26 నుంచి మినీ మహానాడు కార్యక్రమాలు ప్రారంభించనుంది. ఈనెల 26న ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, కార్వాన్, పరిగి, మహబూబ్ నగర్, నర్సాపూర్, సత్తుపల్లిలో మినీ మహానాడులు నిర్వహించనుంది. మే 20లోపు మినీ మహానాడు సమావేశాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. గత నాలుగేళ్లు చంద్రబాబు తెలంగాణ పార్టీని పట్టించుకోలేదు. ఆయన తమ పార్టీకి ఇంకా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఓటు బ్యాంకు ఉందని భ్రమిస్తున్నారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఇక్కడ టీడీపీ కోలుకోలేదన్నది ఆయనకూ తెలుసు. కానీ ఒక ప్రయత్నం. ఏ పార్టీ అయినా పొత్తుకు పిలవక పోతుందా? అని ఒక చిన్న యత్నం. అంతే తప్ప మరే ఇతర కారణం లేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఓటు బ్యాంకు లేదు. జనరేషన్ మారిపోయింది. ఇప్పుడంతా కేసీఆర్, రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్, కొంత భాగం మోదీ ప్రభావం ఉంటుంది. టీడీపీని అభిమానించే ఒక వర్గం కూడా చివరకు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయన్నది కాదనలేని వాస్తవం.
వైఎస్సార్టీపీ అంతే....
ఇక వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా అంతే. అయితే షర్మిల చంద్రబాబులా కాకపోయినా పూర్తిగా ఇక్కడే రాజకీయాలు చేయడానికి వచ్చారంటారు. అందులో వాస్తవం కూడా లేకపోలేదు. తన తండ్రి వైఎస్సార్ ఓటు బ్యాంకు తన పార్టీని గెలిపిస్తుందన్న పిచ్చి నమ్మకంతో షర్మిల కూడా శ్రమిస్తున్నారు. కానీ సాధ్యాసాధ్యాలను మాత్రం షర్మిల చూడటం లేదు. షర్మిల పార్టీ దాదాపు మూడేళ్లవుతుంది. ఒక్కరు కూడా పేరున్న నేత ఇటువైపు చూడలేదు. డబ్బులేక కాదు. షర్మిల పార్టీ వస్తుందన్న నమ్మకం లేకనే ఇటువైపు చూడటం లేదన్న నిజాన్ని ఆమె గుర్తించడం లేదు. తెలంగాణ అంతటా పాదయాత్ర చేశారు. ఒక మహిళ అంత కష్టం పడితే జనం గుర్తిస్తారని షర్మిల వేసుకున్న అంచనాలు నిజం కాకపోవచ్చు. ఆమె వరకూ గెలిస్తే అంతే చాలు. అదే తెలంగాణ జనం షర్మిలకు ఇచ్చిన ఆశీర్వాదంగా చెప్పుకోవాలి తప్ప. సింగిల్ డిజిట్కు మించి సీట్లు వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నది రాజకీయ విశ్లేషకుల అంచనగా వినపడుతుంది.
పరాయి పార్టీలుగానే...
టీడీపీ, వైఎస్సార్టీపీలను తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఆంధ్ర పార్టీలుగానే చూస్తున్నారు. స్థానికేతరులుగానే భావిస్తారు. పొరుగు రాష్ట్రంలో ఇద్దరికీ చెందిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తారన్న కనీసం లాజిక్కు వారు వెళ్లడం లేదు. పోలోమంటూ సభలు పెట్టడం, హడావిడి చేయడం తప్ప రాజకీయంగా ఒనగూరేదేమీ ఉండదన్నది విశ్లేషకుల అంచనా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు లేకపోవచ్చు. ఆయన అభిమానులు కూడా వేరే వారికి టర్న్ అయి చాలా కాలం అయింది. అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేనప్పుడు అంతే. తమ ఓటు మురిగిపోతుందని భావించి ఎవరూ అటువైపు చూడరన్న సత్యాన్ని ఇటు చంద్రబాబు, అటు వైఎస్ షర్మిల గుర్తించి ఎంత తక్కువగా శ్రమించి.. ఎంత స్వల్పంగా ఖర్చు చేస్తేనే బెటర్. లేదంటే రెండు విధాలుగా నష్టపోతారు. అందుకే తెలంగాణలో ఎంత తగ్గి ఉంటే అంత బెటర్ అన్న సూచనలు రాజకీయంగా వినిపిస్తున్నాయి.
Next Story