మహామహులు వచ్చారు.. వెళ్లారు!
ప్రధాన ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటి మీదకు తెచ్చి, బీజేపీపై ఉమ్మడి పోరు కోసం ఏర్పాటు చేసిన సమావేశం శుక్రవారం నిస్సారంగా ముగిసింది.
ఎటూ తేల్చని పాట్నా సమావేశం
'అదో ఫోటో సెషన్' అమిత్‌షా ఎద్దేవా
ప్రధాన ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటి మీదకు తెచ్చి, బీజేపీపై ఉమ్మడి పోరు కోసం ఏర్పాటు చేసిన సమావేశం శుక్రవారం నిస్సారంగా ముగిసింది. గత వారం రోజుల నుంచి జాతీయ మీడియా ఈ ‘కీలక’ సమావేశం గురించి ఊదర గొడుతోంది. ‘ఇక సమరమే’ అన్నంతగా బిల్డప్ ఇచ్చింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ యాదవ్ ఆతిధ్యంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరి, డి.రాజా, లాలూ ప్రసాద్, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన ప్రతిపక్ష నాయకులంతా హాజరయ్యారు.
నాలుగు గంటల ‘మేధో మధనం’లో ఈ సమావేశం పెట్టాల్సిన ఆవశ్యకత గురించి చర్చించుకున్నారు. ‘మా మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు., కానీ మేమంతా ఉమ్మడి సిద్ధాంతాల కోసం పని చేస్తాం’ అని ప్రకటించారు రాహుల్ గాంధీ. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడదామని నిర్ణయించామన్నారు నితీష్ కుమార్, ‘ఈ నియంతృత్వ ప్రభుత్వం గానీ మళ్లీ అధికారంలోకి వస్తే, భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. రక్తపాతంతో ఎన్నికలు నిర్వహించి, ఎన్నికల తర్వాత వందలాది మంది వైరిపక్ష కార్యకర్తలను తమ పార్టీ నేతలు ఊచకోత కోస్తున్నా చోద్యం చూసే మమతక్క నియంతృత్వం గురించి మాట్లాడటం విచిత్రం.
మన దేశపు లౌకిక, ప్రజాస్వామ్య తత్వాన్ని కాపాడటమే ఈ సమావేశ లక్ష్యం అన్నారు సీతారాం ఏచూరి. బీజేపీ వాటిని పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో పాల్గొన్న నేతలంతా మరోసారి బీజేపీ అధికారంలోకి రాకూడదని ప్రతిన బూనారు. వచ్చే నెలలో సిమ్లాలో మరో అఖిల ’ప్రతిపక్ష’ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ అన్యమనస్కంగానే మీటింగ్‌కు హాజరయ్యారు. ఢల్లీి అధికారాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దానిని రాజ్యసభలో వ్యతిరేకిస్తేనే ప్రతపక్షాలతో కలుస్తానని ఆయన తేల్చిచెప్పారు. ఆ విషయంపై కాంగ్రెస్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం విశేషం.
ఇదిలా ఉండగా ప్రతిపక్షాల మీటింగ్‌ని ఫోటో సెషన్‌తో పోల్చారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఈ సమావేశాన్ని డ్రామా హౌస్‌గా అభివర్ణించారు. ఎవరేమన్నా ఇప్పటికి ఈ మీటింగ్ తేల్చిందేమీ లేదు. ఇక సిమ్లాలో చూడాలి. ఏం జరుగుతుందో!