Mon Dec 23 2024 12:27:15 GMT+0000 (Coordinated Universal Time)
ముందస్తు.. కేసీఆర్ డిసైడ్ అయ్యారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారా? డిసెంబరు నెలలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత శాసనసభను రద్దు చేస్తారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ డిసెంబరు నుంచి జిల్లాల పర్యటన జోరు కూడా పెంచుతున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మూడో సారి అధికారంలోకి రావాలంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లడం మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే కేసీఆర్ మాత్రం అనేక సందర్భాల్లో ముందస్తు ఎన్నికలు ఉండవని పదే పదే చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా?
సంక్షేమం.. అభివృద్ధి...
వాస్తవానికి తెలంగాణ శాసనసభకు మరో ఏడాది సమయం గడువు ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ ప్రభుత్వానికి సహకరించడం లేదంటూ కేసీఆర్ ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. దాదాపు నలభై వేల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం వైఖరి కారణంగా రాలేదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దెబ్బతీసేందుకే తమను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ప్రజల్లోకి వెళతారని చెబుతున్నారు. దళిత బంధు వంటి పథకాన్ని అమలు చేయాలంటే నిధులు అవసరం. కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ స్థాయిలో నిధులు లేవు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజల వద్దనే తేల్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారంటున్నారు కొందరు.
ఏడాది మాత్రమే...
ఏడాది మాత్రమే ఎన్నికలకు గడువు ఉండటంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ప్రయోజనం ఉంటుందా? అన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మరో ఆరు నెలలు మాత్రమే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి వీలుంటుంది. ఈ ఆరు నెలల్లో కేసీఆర్ సాధించేదేమిటి అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ ఆరు నెలల కాలంలో ప్రజల్లో మార్పు వస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. నిజంగా కేసీఆర్ పాలనపై ప్రజల్లో పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఆరు నెలలు అయినా ఏడాదయినా ఒకటే. అందులో పెద్దగా ఏమాత్రం తేడా ఉండదు. ఆరు నెలలు ముందు వెళ్లినా, బీజేపీపై విమర్శలు చేసి ఎన్నికలకు వెళ్లినా ప్రయోజనం ఉండబోదన్నది గులాబీ పార్టీ నేతల్లో కొందరి వాదన.
ప్రయోజనమేనా?
అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై ఫైనల్ డెసిషన్ కేసీఆర్ దే. ఆయన అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. పార్టీకి ప్రయోజనకరంగా ఉంటేనే ముందస్తు ఎన్నికలకు వెళతారు. లేకుంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు జరుగుతాయి. గతంలోననూ గుజరాత్ తో పాటు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఎటూ 2024లో లోక్ సభ ఎన్నికలు ఉంటాయి. అంతకు ముందుగానే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండబోదన్నది కొందరి అభిప్రాయం. మరి కేసీఆర్ అనుకున్నదే జరుగుతుంది కాబట్టి అంచనా వేయలేకపోయినా ముందస్తు ఎన్నికలపై మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.
Next Story