Sat Nov 16 2024 22:43:56 GMT+0000 (Coordinated Universal Time)
బద్వేలు తరహాలోనే భంగపాటు తప్పదా?
ఏపీలో శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉంది. ఓట్లను పటిష్టం చేసుకోవడానికి అన్ని పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉంది. ఓట్లను పటిష్టం చేసుకోవడానికి అన్ని పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఓట్లను కాపాడుకోవడమే కాకుండా, క్షేత్రస్థాయిలో మరింత బలపడాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో ఓట్లు బదిలీ కాకుండా చూడాలి. గతంలో బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి.
మెజారిటీ తగ్గించాలన్న....
బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మెజారిటీ తగ్గించాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ అగ్రనాయకత్వం క్యాడర్ కు ఎటువంటి సంకేతాలు పంపలేదు. ప్రకటన చేయలేదు. కానీ బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధకు 1.12 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీకి కూడా అనూహ్యంగా 21,661 ఓట్లు వచ్చాయి. బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి ప్రకటన అధినాయకత్వం నుంచి రాకపోవడంతో అనేక మంది వైసీపీకి ఓట్లు వేయగా, కొందరు కరడు కట్టిన టీడీపీ ఓటర్లు మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఈ రెండు పార్టీలకు బదిలీ అయినట్లు ఫలితాల తర్వాత వెల్లడయింది. అక్కడి స్థానిక నాయకత్వం కూడా నేరుగా పోటీలో ఉన్న అభ్యర్థుల వైపు మొగ్గు చూపింది. అప్పట్లో స్థానిక నాయకులు పోటీ చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా.
ఆత్మకూరులోనూ అంతేనా?
ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నికకు కూడా టీడీపీ దూరంగా ఉంది. ఇది కూడా సెంటిమెంట్ తో జరుగుతున్న ఎన్నికే. ఇక్కడ కూడా టీడీపీ ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. బీజేపీ లేదా చిన్నా చితకా పార్టీలకు ఈ ఓట్లు బదిలీ అయితే పరవాలేదు. తర్వాత ఎన్నికల్లో తిరిగి టీడీపీకి ఆ ఓట్లు వస్తాయి. కానీ అధికార వైసీపీ వైపు ఓటర్లు మరలితే ప్రమాదమని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. పొత్తులపై ఎటువంటి అడుగు ముందుకు పడకపోవడంతో పలానా పార్టీకి వేయమని టీడీపీ అగ్రనాయకత్వం చెప్పలేని పరిస్థితి. అందుకే పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది.
తిరుపతిని చూసైనా...?
తిరుపతి ఉప ఎన్నిక సెంటిమెంట్ కాకపోవడంతో టీడీపీ పోటీ చేసి తమ ఓటు బ్యాంకును పటిష్టపర్చుకోగలిగింది. వైసీపీ అభ్యర్థి మెజారిటీని నిలువరించగలిగింది. 3.54 లక్షల ఓట్లను సైకిల్ గుర్తుపై వేయించుకోగలిగింది. ఆత్మకూరులో పోటీకి దూరంగా ఉండాలని ప్రకటించడమూ తప్పిదమేనని అక్కడ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటికే అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో తమ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా స్థానిక టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీకి బదిలీ అయితే పరవాలేదు కాని, వైసీపీకి ఓట్లు బదిలీ అయితేనే ఇబ్బంది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
Next Story