Wed Nov 20 2024 16:37:11 GMT+0000 (Coordinated Universal Time)
గల్లా క్యాంప్ ఎత్తేసినట్లేనా?
రెండున్నరేళ్ల నుంచి గల్లా జయదేవ్ లో స్పష్టమైన మార్పు కన్పిస్తుంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు
తెలుగుదేశం పార్టీ అసలే కష్టాల్లో ఉంది. వరస ఓటములతో ఇబ్బంది పడుతుంది. పార్టీని ట్రాక్ లో పెట్టేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ఫలితం లేకుండా పోతుంది. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. అందులో గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఒకరు. గల్లా కుటుంబం టీడీపీకి దాదాపు దూరమయిందనే సంకేతాలు వస్తున్నాయి.
రెండుసార్లు....
పార్టీ పై ప్రేమ ఉంటే కసిగా పోరాడాల్సింది అధికారంలో లేనప్పుడే. వదలించుకుని వెళదామనుకునే వారికి పార్టీ పట్టదు. అధినేతను కూడా కేర్ చేయాల్సిన అవసరం లేదు. గల్లా జయదేవ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. గల్లా జయదేవ్ కు రెండుసార్లు గుంటూరు ఎంపీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు గెలిపించుకున్నారు. పదేళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా అవకాశమిచ్చారు. చిత్తూరు జిల్లా అయినప్పటికీ సామాజికవర్గం సమీకరణల్లో భాగంగానే గుంటూరు సీటును గల్లా జయదేవ్ దక్కించుకున్నారు. 2014లో గెలిచి ఐదేళ్లు బాగానే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది.
గత కొంత కాలం నుంచి...
కానీ ఇప్పుడు రెండున్నరేళ్ల నుంచి గల్లా జయదేవ్ లో స్పష్టమైన మార్పు కన్పిస్తుంది. తమ పరిశ్రమలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్న కారణం కావచ్చు. టీడీపీకి భవిష్యత్ లేదని కావచ్చు. కారణాలేవైనా గల్లా మాత్రం డిస్టెన్స్ చంద్రబాబుతో మెయిన్ టెయిన్ చేస్తున్నారు. తన నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యాలయంపై దాడి జరిగితే గల్లా తొంగి చూడలేదు. చంద్రబాబు 36 గంటల దీక్ష చేసినా రాలేదు. అంటే పార్టీ తనకు అవసరం లేదన్న భావనతోనే ఉన్నారనుకోవాలి.
డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేస్తూ...
ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ తన నియోజకవర్గం పరిధిలో జోక్యం చేసుకోలేదు. దీంతో పాటు అమరావతి రైతులు 37 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా గల్లా జయదేవ్ పట్టించుకోలేదు. కనీసం వారిని పలకరించిన పాపాన పోలేదు. త్వరలోనే ఆయన సొంత జిల్లాలోకి పాదయాత్ర ఎంటర్ కాబోతుంది. పరిస్థితులను చూస్తుంటే గల్లా జయదేవ్ టీడీపీకి త్వరలోనే గుడ్ చై చెప్పేస్తారన్న టాక్ పార్టీలోనే నడుస్తుంది. చంద్రబాబు కూడా గల్లాను పట్టించుకోవడం మానేశారని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. మొత్తం మీద గల్లా ఎందుకు సైలెంట్ అయ్యారన్నది ఆయన గొంతు విప్పితేనే తెలుస్తుంది.
- Tags
- galla jayadev
- tdp
Next Story