Sat Nov 16 2024 00:51:44 GMT+0000 (Coordinated Universal Time)
పరిటాల కు ఈసారి నో టిక్కెట్
పరిటాల కుటుంబానికి ఈసారి ఒకటే టిక్కెట్ అని అది కూడా రాప్తాడులో సునీత పోటీ చేస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది.
చంద్రబాబు ఈసారి లెక్కలు అన్నీ పక్కాగా ఉండనున్నాయి. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారు. వివిధ సర్వేలు, నియోజకవర్గ పరిస్థితులను బేరీజు వేసుకుని మరీ ఆయన ఈసారి టిక్కెట్ల కేటాయింపు జరుగుతుంది. ప్రధానంగా ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్నది మరోసారి చంద్రబాబు అమలు చేస్తారంటున్నారు. ఒక్క సీటు అయితే ఖచ్చితంగా కుటుంబం మొత్తం అక్కడే దృష్టి పెట్టి గెలుపు సాధించి తీరుతుందని చంద్రబాబు అంచనా. అందుకే ఈసారి పరిటాల కుటుంబానికి కూడా ఒక్కటే టిక్కెట్ అన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది.
గత ఎన్నికల్లోనూ....
ఇదేమీ కొత్త కాదు. 2019 ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇచ్చారు. రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పరిటాల శ్రీరామ్ ను ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకూ అక్కడ ఉన్న వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో పరిటాలను నియమించారు. పరిటాల కుటుంబానికి ధర్మవరంలోనూ పట్టుంది. అయితే ఈసారి తన తల్లి సునీత రాప్తాడు నుంచి తాను ధర్మవరం నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావించారు. అందుకే ధర్మవరంలోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు.
తిరిగి వచ్చినా... రాకున్నా....
కానీ బీజేపీలోకి వెళ్లిన మాజీ టీడీపీ నేత వరదాపురం సూరి తిరిగి పార్టీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో వరదాపురం సూరి కూడా యాక్టివ్ అయ్యారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన తిరిగి టీడీపీలోకి వస్తారన్న ప్రచారంతో పరిటాల వర్గం గుర్రుగా ఉంది. ఆయన వచ్చినా ధర్మవరం టిక్కెట్ తనదేనని పలు సమావేశాల్లో పరిటాల శ్రీరామ్ చెబుతున్నారు.
సునీతనే పోటీ చేయించాలని.....
అయితే ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీతో పొత్తు కుదిరితే వరదాపురం సూరి బీజేపీ కోటాలో ధర్మవరం సీటును దక్కించుకుంటారన్న ప్రచారమూ ఉంది. ధర్మవరంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరదాపురం సూరి ఫిక్స్ అయ్యారు. టీడీపీ నుంచా? బీజేపీ నుంచా? అన్నది త్వరలోనే స్పష్టత రానుంది. చంద్రబాబు కూడా వరదాపురం సూరి పట్ల సాఫ్ట్ కార్నర్ గానే ఉన్నారు. పరిటాల కుటుంబం నుంచి ఈసారి రాప్తాడులో సునీతనే పోటీ చేయించాలన్న భావనతో చంద్రబాబు ఉన్నారు. ధర్మవరంలో పరిటాల, వరదాపురం సూరి వర్గాలు కలిస్తే విజయం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో పరిటాల కుటుంబానికి ఈసారి ఒకటే టిక్కెట్ అని, అది కూడా రాప్తాడులో సునీత పోటీ చేస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది.
Next Story