Sat Nov 09 2024 01:21:51 GMT+0000 (Coordinated Universal Time)
ఈటల.. తో ఆటలా? ఆలింగనమా?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూల వైఖరి పై చర్చ జరుగుతోంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందే. మొన్నటి విజయశాంతి నుంచి నిన్నటి కోదండరామ్ వరకూ ఆయన ఒకసారి బై బై చెప్పారంటే ఇక అటువైపు చూడరు. వారి ముహాలను కూడా చూసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడరు. కేసీఆర్ అంతటి జగమొండి. ఆర్టీసీ కార్మికుల విషయంలోనూ అంతే. ప్రేమ పుడితే కేసీఆర్ లాంటి నేత కూడా ఉండరు. అంతా తానే అయి వారిని దరి చేర్చుకుంటారు. కావాల్సినంత పెడతారు. పెట్టి పెట్టి మరీ చంపే గుణం కేసీఆర్ది. అలాంటిది ఇటీవల కాలంలో కేసీఆర్ వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లే కనపడుతుంది. స్వామి గౌడ్, దాసోజు శ్రావణ్ వంటి వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం ఆయనలో మార్పులకు కారణమని పార్టీ నేతలే చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో ఓడించేందుకు...
ఇక తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పట్ల కూడా కేసీఆర్ వైఖరి మారిందా? అసలు ఈటలను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడించడానికి ఎంత ప్రయత్నించారు. సర్వశక్తులూ ఒడ్డారు. ఓట్ల కోసం దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చి ఆ నియోజకవర్గంలో నిధులు కుమ్మరించారు. ఇక హుజూరాబాద్ నేతలకయితే పదవులే పదవులు. కౌశిక్ రెడ్డి, ఎల్. రమణలు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. అయినా ఎనిమిది సార్లు గెలిచిన ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ సక్సెస్ కాలేకపోయారు. హుజారాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి ఆయనలో మార్పు తెచ్చిందనే వారు కూడా లేకపోలేదు. ఈటల గెలుపు అవతల పెడితే అంత ఖర్చు చేసినా, పథకాలు అన్ని అమలు చేసినా గులాబీ జెండా ఎగరపోవడంపై ఆయన కొంత ఆలోచనలో పడ్డారనే చెప్పాలి.
సరైన బీసీ నేత...
ఈటల రాజేందర్ కు ధీటైన బీసీ నేత గులాబీ పార్టీలో కరువయ్యారు. బండా ప్రకాష్ కు మండలి వైఎస్ ఛైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ బీసీలందరూ తన వైపు చూస్తారన్న నమ్మకం కేసీఆర్కు లేనట్లుంది. అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత ఇంత వరకూ ఆయనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లభించలేదు. ఈటల ఫేస్ ను చూసేందుకు కూడా ఒక దశలో కేసీఆర్ ఇష్టపడలేదంటారు. అందుకే అసెంబ్లీ సమావేశాలలో ఈటల రాజేందర్ వైపు చూసేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ బడ్జెట్ సమావేశాల్లో మార్పు వచ్చింది. ఈటల రాజేందర్ కు మాట్లాడే అవకాశం కల్పించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం కేసీఆర్ స్వయంగా చెప్పడం విశేషం. ఈటలను పిలిచి చర్చించి ఆ సమస్యలను పరిష్కరించాలని మంత్రులకు కేసీఆర్ సభలోనే ఆదేశించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపైనా, మోదీపైనా విమర్శల చేశారు.
ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకం...
అంతేకాదు మంత్రి కేటీఆర్ ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సయితం ఈటలను గౌరవిస్తూ పలకరింపులు దేనికి సంకేతం? దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో ఈటల రాజేందర్ ను మెచ్చుకోలుగా మాట్లాడారు. రాజేందర్ ఇచ్చిన సలహాలు స్వీకరిస్తామని చెప్పడమే కాకుండా సమస్యలు లేకుండా ఈటల ఎందుకు ప్రస్తావిస్తారంటూ వెనకేసుకొచ్చినట్లు మాట్లాడారు. బీజేపీలో ఈటల వాయిస్ బలపడకముందే తిరిగి గులాబీ గూటికి తీసుకు రావాలనా? లేక ఈటల తనతో టచ్ లోకి వస్తున్నాడన్న సంకేతాన్ని బీజేపీ అధినాయకత్వానికి పంపే ఉద్దేశ్యమా? తెలీదు కాని ఈటల రాజేందర్ ఇప్పుడు కావాల్సిన వాడయ్యాడు.
ఏదైనా కావొచ్చు...
అయితే ఇది గమనించిన ఈటల రాజేందర్ తనను డ్యామేజీ చేసేందుకే ముఖ్యమంత్రి అలా మాట్లాడారని బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను వారు పిలిచినా ఆ పార్టీలోకి వెళ్లనని చెప్పుకున్నారు. అంతేకాదు గెంటేసిన.. గేలిచేసిన వాళ్లు పిలిచినా వెళ్లనని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద కేసీఆర్ మైండ్ గేమ్లో భాగంగా ఈ తరహా ధోరణిని ప్రదర్శించారా? లేక పార్టీలో బలమైన బీసీ నేత అవసరమని గుర్తించి ఈటల విషయంలో కేసీఆర్ ఒక అడుగు వెనక్కు వేశారా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏదైాన జరగొచ్చు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. కేసీఆర్ దిగి వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాగే మైండ్ గేమ్ ఆడినా పెద్దగా పెదవి విరవాల్సిన అవసరం లేదు. అంతా ఈవీఎంల మహిమ అనుకోవాల్సిందే.
Next Story