Tue Dec 24 2024 01:53:37 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్ న్యూస్ : ఏపీ కేబినెట్ విస్తరణకు జగన్ గ్రీన్ సిగ్నల్?
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. ప్రస్తుత కేబినెట్ లో నలుగురు మంత్రులను తప్పించే ఛాన్స్ ఉంది
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. ప్రస్తుత మంత్రివర్గంలో నలుగురు మంత్రులను తప్పించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో పూర్తయిన వెంటనే మంత్రి వర్గ విస్తరణకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇది సంచలనమే. జగన్ 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే జరిగిన మంత్రి వర్గ విస్తరణ జరిపారు. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఎమ్మెల్సీగా రాజీనామాచేయించిన తర్వాత మరోసారి విస్తరణ జరిపారు. శాసనమండలిని రద్దు చేస్తామని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరూ అప్పుడు శాసనమండలిగా ఉండేవారు. కానీ వారిని తొలగించిన తర్వాత మండలి నుంచి ఎవరూ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించడం లేదు.
కొత్త జిల్లాల ఏర్పాటు...
రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుంచి వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం నుంచి సీదిరి అప్పలరాజును తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడున్న మంత్రుల్లో కొందరి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం జగన్ కాకుండా 25 మంది కేబినెట్ లో ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని తప్పించాలని జగన్ యోచిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం, సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా మంత్రివర్గంలోకి కొందరిని తీసుకునే అవకాశముందని తెలిసింది. ఎమ్మెల్సీలుగా గెలిచే వారిని, ప్రస్తుతం ఉన్న వారిలో కొందరికి తన కేబినెట్ లో స్థానం కల్పించాలన్న యోచనలో వైసీపీ అధినేత ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
పనితీరు మెరుగుపర్చుకోని...
మంత్రులు కొందరు ఎన్ని సార్లు చెప్పినా పనితీరు మెరుగు పర్చుకోకపోవడంతో వారిని మార్చాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లా నుంచి తీసుకున్న సీదిరి అప్పలరాజు, గోపాలకృష్ణలు కేబినెట్ లోకి వచ్చి మూడేళ్లకు పైగానే అవుతుంది. అందువల్ల వీరిని తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మంత్రిపై కూడా జగన్ కు వ్యతిరేక నివేదికలు అందినట్లు సమాచారం. ఆ మంత్రిని పక్కన పెట్టి ఆ జిల్లాలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. మరొకరికి తన కేబినెట్ లో నెల్లూరు నుంచి అవకాశం కల్పించవచ్చన్నది అత్యున్నత వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
రాయలసీమ నుంచి...
కొందరు మంత్రులు విపక్షాల విమర్శలకు సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. కనీసం రెస్పాన్స్ కావడం లేదు. వారిని కూడా తప్పించే అవకాశముందటున్నారు. దీంతో పాటు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏర్పాటయిన మంత్రివర్గం నుంచి కొనసాగుతున్న వారిని కూడా కొందరిని తప్పించే అవకాశముందంటున్నారు. మరి ఎంత మందిని ప్రస్తుత మంత్రి వర్గం నుంచి తొలగిస్తారు? కొత్త వారికి ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై ఫ్యాన్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. రాయలసీమలో కూడా మార్పులు, చేర్పులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. మొత్తం మీద మూడో సారి మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమవుతున్నారు. అదే ఎన్నికల కేబినెట్ గా ఆయన మలచుకోనున్నారని చెబుతున్నారు.
Next Story