Sat Nov 23 2024 00:04:36 GMT+0000 (Coordinated Universal Time)
రెబల్ గా మరో ఎంపీ.. కారణమదేనా?
వైసీపీలో మరో ఎంపీ రెబల్ గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన ఎన్నికల సమయంలో పార్టీని వీడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వైసీపీలో మరో ఎంపీ రెబల్ గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన ఎన్నికల సమయంలో పార్టీని వీడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయనే నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ హైకమాండ్ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారు. ఇటీవల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నరసరావుపేటకు వచ్చినా ఆయన పాల్గొనలేదు. సభలో కూడా ఆయన కన్పించకపోవడం లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో చెప్పకనే తెలుస్తోంది. ఆయన చివరి నిమిషంలో పార్టీ మారే అవకాశాలున్నాయన్న టాక్ బలంగా వినపడుతుంది.
మంచి పేరున్న....
చిన్న వయసులో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన వారిలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. ఆయన వివాదరహితుడు. లావు కుటుంబానికి ప్రజల్లో మంచి పేరుంది. అలాంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గత కొంత కాలంగా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా చిలకలూరిపేట, వినుకొండ ఎమ్మెల్యేలతో ఆయనకు మొదటి నుంచి పొసగడం లేదు. పార్లమెంటు సభ్యుడిగా తనకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రొటోకాల్ కూడా ఈ ఎమ్మెల్యేలు పాటించడం లేదు. ఈ విషయాన్ని పలుమార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
పార్టీ నేతలతో....
ముఖ్యంగా ప్రస్తుత మంత్రి విడదల రజనితో ఆయనకు తొలి నుంచి వైరం ఉంది. ఆమెను మంత్రిని చేయడంతో మరింతగా లావు రగిలిపోతున్నారని తెలిసింది. చిలకలూరిపేటలో పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ తో తాను సఖ్యతగా మెలగడం చూసి విడదల రజని ఓర్వలేకపోతున్నారని ఆయన సన్నిహితుల వద్ద చెప్పారు. విడదల రజనీ పై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. అలాగే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అక్కడ మరో నేత మల్లికార్జునరావుతో తనకున్న సత్సంబంధాలను చూసి ఓర్వలేకపోతున్నారని లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపిస్తున్నారు.
హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా...?
నరసరావుపేటలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు తనను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారతారన్న వదంతులు ప్రారంభమయ్యాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు అదే నిర్ణయం తీసుకుంటే గుంటూరు జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బ తగులుతుంది. అయినా పార్టీ అధినాయకత్వం మాత్రం అన్నీ తెలిసి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ పెద్దలే కొందరు ఎమ్మెల్యేలను లావు శ్రీకృష్ణదేవరాయలకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని కూడా చెబుతున్నారు. మొత్తం మీద లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో ఇమడలేక పోతున్నారు. ఆయన ఎంపీ పదవిలో ఉన్నా సంతృప్తిగా లేరన్నది వాస్తవం. ఈరోజు జగన్ ఢిల్లీ పర్యటనలో ఆయన కన్పిస్తారా? లేదా? అన్నది కూడా చూడాల్సి ఉంది.
Next Story