Fri Dec 27 2024 15:07:00 GMT+0000 (Coordinated Universal Time)
మాంచి విలన్ కావాలి.. దొరకట్లేదుగా?
టాలీవుడ్ లో విలన్ కొరత ఎక్కువగా ఉంది. ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది
తెలుగు సినిమా పుట్టి ఎనభై దశాబ్దాలు దాటింది. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటి వరకూ సిల్కర్ స్క్రీన్ పై ఎందరో ప్రేక్షకులను రంజింప చేశారు. హీరోలు మాత్రం దశాబ్దాల తరబడి వారే ఉంటారు. కానీ హీరోయిన్స్, విలన్స్ విషయానికి వచ్చే సరికి మారుతూ ఉండాలి. హీరోయిన్స్ కూడా ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో కొనసాగడం ఈరోజుల్లో కష్టమయిపోయింది. ఓ పది సినిమాల్లో నటించగానే హీరోయిన్ అంటే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారన్న భావన ఉంది. హీరో మాత్రం అలాగే కొనసాగుతారు. హీరోయిన్స్ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునైనా ఆఫర్లు ఇచ్చి మరీ తమ స్క్రీన్ కు మరింత అందాన్ని తెచ్చెపెట్టాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు.
స్క్రీన్ స్పేస్...
సరే హీరోయిన్స్ సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు విలన్ ల పరిస్థితి కూడా అదే మాదిరిగా తయారయింది. నిజానికి సినిమాలో హీరోకు ఉండేంత స్క్రీన్ స్పేస్ విలన్ కు కూడా ఉంటుంది. విలన్ కాఠిన్యాన్ని.... కరకుదనాన్ని ఎంతగా చూపితే సినిమా అంత పండుతుందని ప్రతి డైరెక్టర్ భావిస్తాడు. ఒక సినిమాలో విలన్ గా సక్సెస్ అయినా మరొక సినిమాలో అదే విలన్ కు అవకాశం దక్కడం లేదు. ఎందుకంటే విలన్ అంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. హీరో చేతిలో దెబ్బలు తిన్నా.. సరే కొత్త ఫేస్ ను ప్రేక్షుకులు కోరుకుంటున్నారు. హీరోల అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు. అందుకే ఇప్పడు తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ల కొరత తీవ్రంగా ఉందంటున్నారు.
నాడు దశాబ్దాల కాలం....
పాత సినిమాలను ఒకసారి చూస్తే నాగభూషణం, ఎస్వీరంగారావు వంటి మహానటులు దశాబ్దాల కాలం పాటు విలన్ లుగా నటించారు. అనంతరం రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ వంటి వారు ఎక్కువ కాలం తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా కన్పించరు. అయినా వారు బోరు కొట్టలేదు. కైకాల అంటే పక్కా విలన్. రావుగోపాలరావు అంటే డైలాగులతోనే సినిమాకు ఒక హైప్ తీసుకువస్తారు. అనంతరం కోట శ్రీనివాసరావు లాంటి వారు కూడా విలన్ గా చాలా కాలమే రాణించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదారు సినిమాల్లో విలన్ లుగా నటించిన వారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. కొందరు కామెడీకి డైవర్ట్ అయిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాకు సరైన విలన్ తెలుగులో కన్పించడం లేదు.
నేడు ఐదు సినిమాలకు మించి...
పైగా హీరోలకు తగిన వయసు ఉండే విలన్ కావాలి. కాస్త ఎక్కువ కాకూడదు. తక్కువ కాకూడదు. అందుకే విలన్లను కూడా ఇతర భాషల నుంచి రప్పిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమాలో దునియా విజయ్ ను విలన్ గా చూపారు. ఇక వాల్తేరు వీరయ్యలోనూ రోహిత్ పాఠక్ కు విలన్ గా ఒకింత ఆకట్టుకున్నారు. గతంలో సోనూ సూద్ పక్కా విలన్ పాత్ర పోషించాడు. కానీ సోనూ సోద్ ను విలన్ గా ఇప్పుడు ప్రేక్షకులు యక్సెప్ట్ చేయడం లేదంటున్నారు నిర్మాతలు.. దర్శకులు. అందుకే హీరోలు రెడీగా ఉన్నారు కానీ విలన్ల కోసం టాలివుడ్ లో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళ, మలయాళం, కన్నడ, హిందీ ఒకటని లేదు. భాషలకు అతీతంగా ఇతర ప్రాంతాల నుంచి విలన్ లు ఇప్పుడు టాలివుడ్ కు దిగుమతి అవుతున్నారు. అలా మన ఇండ్రస్ట్రీని విలన్ ల కొరత పట్టిపీడిస్తుంది.
Next Story