రెడ్లను కాదని కాంగ్రెస్ మనగలదా? ఇందిరకే తప్పని భంగపాటు
కొత్త, పాత నేతల మధ్య పోరు కాంగ్రెస్ పార్టీని పతనం దిశగా తీసుకెళ్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది
తెలంగాణ కాంగ్రెస్‌లో రగిలిన కార్చిచ్చు దావానలంలా మారుతోంది. ఆ అగ్గిమంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అనాదిగా కాంగ్రెస్ పార్టీ జెండాకు అండగా నిలుస్తూ వస్తోన్న రెడ్డి నేతల మధ్య వర్గపోరు.. అసలు పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేలా తయారైంది. ఇప్పటి వరకూ తెలంగాణ తెచ్చినం అని చెప్పుకుంటోన్న గులాబీ పార్టీకి.. మేమే ఇచ్చినం అని చెప్పుకునే కనీస ధైర్యం ఉన్న హస్తం పార్టీ కూడా అంతర్గత పోరుతో ముక్కలు ముక్కలు కాబోతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. కొత్త, పాత నేతల మధ్య పోరు పార్టీని పతనం దిశగా తీసుకెళ్తోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఏపీలో పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోలేక టీ కాంగ్రెస్ కూడా చతికిలపడింది. గత ఎన్నికల్లో గులాబీ రెపరెపలను దీటుగా తట్టుకుని నిలిచిన కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే కారెక్కేశారు. మిగిలిన నేతలు కూడా రోజుకో తన్నులాటతో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేస్తారేమోనన్న సందేహం సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మెదళ్లను తొలుస్తోంది.