Fri Nov 15 2024 03:51:12 GMT+0000 (Coordinated Universal Time)
దారి చూపిన మోదీ.. పవన్ "రూట్" అదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీ, బీజేపీని పక్కన పెట్టుకుని వైసీపీతో యుద్ధం చేయాలని భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. అలాగని బీజేపీని ఇప్పటికిప్పుడు వదిలపెట్టే ధైర్యం పవన్ కల్యాణ్ చేయలేరు. ఎందుకంటే బీజేపీ సంగతి తెలియంది కాదు. బీజేపీని ఉన్నట్లుండి వదిలేసి వస్తే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అన్ని రకాలుగా వత్తిళ్లు ఎదురువుతాయి. సమస్యలు వస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు.
మిత్రులను ఇబ్బంది పెట్టడం...
ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి సంస్థలు తనను ఏమీ చేయలేకపోవచ్చని పవన్ కల్యాణ్ భావించవచ్చు. తనను నమ్ముకున్న కొందరు ఉన్నారు. వారంతా ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడతారు. సరైన సమయంలో పార్టీకి అండగా నిలిచిన వారిని కష్టాల్లోకి నెట్టడం పవన్ కల్యాణ్ కు సుతారమూ ఇష్టం లేదంటున్నారు ఆయన సన్నిహితులు. అందుకే పవన్ బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అలాగని పోలోమంటూ టీడీపీని నమ్మి వెంట నడవడటమూ ఇష్టం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అన్న ఉద్దేశ్యంలో పవన్ ఉన్నట్లు తెలిసింది.
టీడీపీతో కలిసినా...
టీడీపీతో చేతులు కడిపినా తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అక్కడ అనుభవమున్న నేత, రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంకు, క్యాడర్ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఆయనను కాదని తనకు సీఎం కుర్చీ వచ్చే అవకాశమే లేదు. మరోవైపు తాను ఎప్పుడూ ఇలా ఎవరో ఒకరికి మద్దతుదారుగానే నిలవాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కు ఒక క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. మోదీ నుంచి పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిని గా ప్రకటిస్తామని హామీ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కింగ్ అవ్వాలని...
అదే ఎన్నికల అనంతరం చంద్రబాబు తమ మద్దతు కావాల్సి ఉంటే తాము సీఎం పదవిని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని మోదీ హితబోథ చేసినట్లు తెలుస్తోంది. అందుకే తొందరపడి ఎలాంటి పొత్తులకు టీడీపీతో ప్రయత్నించవద్దని మోదీ చెప్పినట్లు అంటున్నారు. కింగ్ అవ్వాలంటే మేకర్ కాకూడదని పవన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న అఖిలపక్షం కూడా వాయిదా పడిందంటున్నారు. పవన్ దూకుడుకు మోదీ కళ్లెం వేసి వెళ్లారని రాజకీయ విశ్లేషకులు సయితం అంటున్నారు.
మరో ఐదేళ్లపాటు...
తమకు వచ్చే ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా టీడీపీ ఖచ్చితంగా తమకు సీఎం సీటు ఆఫర్ చేస్తుందన్న నమ్మకంతోనే టీడీపీతో కలసి నడిచేందుకు స్పీడ్ తగ్గించారని తెలిసింది. కర్ణాటకలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిరి టీడీపీ తమకు అవకాశం ఉస్తుందని నమ్ముతున్నారు. మరో ఐదేళ్లు పార్టీని నడిపేకంటే ఇప్పుడే తాడో పేడో తేల్చుకోవడం బెటర్ అన్న నిర్ణయానికి పవన్ వచ్చారు. అందుకే ఒక్క ఛాన్స్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. త్రిముఖ పోటీ వచ్చే ఎన్నికల్లో జరిగిని ఆశ్చర్యం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మోదీతో భేటీ తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
- Tags
- pawan kalyan
- tdp
Next Story