Sat Nov 23 2024 02:00:39 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్.. "ఆరా" .. నిజమా?
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడే కొన్ని సర్వేలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడే కొన్ని సర్వేలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల సమయం ఉంది. అయితే ఇప్పుడే జనం నాడిని పట్టేశామంటూ కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే మైండ్ గేమ్ లో భాగంగా జరుగుతున్నాయా? లేదా? ఒక పార్టీని మానసికంగా ముందే దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పోలింగ్ కు ముందు ఓటరు ఏ పార్టీకి ోటు వేయాలన్నది డిసైడ్ అవుతాడు. ఇప్పుడు చేసే సర్వేలన్నీ ఓటరు తాత్కాలిక ఆగ్రహావేశాలను బట్టి ఉంటాయి.
గతంలో ఫలితాలు..
తెలంగాణలో ఆరా సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సంస్థకు మంచి క్రెడిబిలిటీ ఉంది. కాదనలేం. గతంలో చెప్పినవన్నీ నిజమయ్యాయి. కానీ ఆ సంస్థ ఇచ్చిన గణాంకాలు నమ్మకంగా లేవు. బీజేపీ సెకండ్ ప్లేస్ కు తీసుకు రావడం, కాంగ్రెస్ ను మూడో ప్లేస్ కు నెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరా సంస్థ గతంలో చెప్పిన ఫలితాలు కాస్త అటు ఇటుగా కరెక్ట్ గానే వచ్చాయి. అయితే ఎప్పుడూ పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలను చెప్పే ఆరా సంస్థ పనిగట్టుకుని ఏడాదిన్నర ముందు చెప్పడమే అనేక అనుమానాలకు దారితీస్తుంది.
బీజేపీతో సంబంధాలున్నాయని...
ఆరా సర్వే సంస్థ మస్తాన్ కు బీజేపీతో సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ఆయన ఆర్ఎస్ఎస్ పార్ట్ టైమర్ అని చెబుతున్నారు. అలాంటి సంస్థ అధినేత ఎన్నికలకు 18 నెలలు ముందు చేసే సర్వే ఫలితాలు ఎంత మేర వాస్తవమన్నది తేలాల్సి ఉంది. ఆయన ఇచ్చిన సర్వే రిపోర్టులో టీఆర్ఎస్ కు 38.88 శాతం, బీజేపీకి 30,48 శాతం, కాంగ్రెస్ కు 23.71 శాతం, ఇతరులకు 6.93 శాతం ఓటింగ్ ఉన్నట్లు ఇచ్చారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మూడు లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఆయన చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీకి అర్బన్ ప్రాంతాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఓటుబ్యాంకు లేదన్నది సుస్పష్టం. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగి ఉండవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సరైన నాయకత్వమే లేదు.
కాంగ్రెస్ అంత బలహీనంగానా?
కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీ నుంచి వలసలు లేవు. చేరికలే ఉన్నాయి. నేతలు చేరుతున్నారంటే క్షేత్రస్థాయిలో ఓటర్లు పార్టీ వైపు మొగ్గుచూపుతూనే ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తికనపరుస్తారు. లేకుంటే లేదు. అలాగే పార్టీ పరిస్థిితి బాగాలేకపోతే నేతలు ఇతర పార్టీల వైపు చూపుతారు. కానీ గత ఏడాదిన్నరగా ఏ నేతా పార్టీని వీడలేదు. కాంగ్రెస్ సభ్యత్వమే 45 లక్షలు ఉంది. అలాంటి పార్టీని పూర్తిగా మూడో స్థానానికి నెట్టివేయడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు ఉండవచ్చు. కానీ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా దాని పట్ల సానుభూతి ఉంది. పెట్రోలు నుంచి నిత్యావసరాలు పెంచేసిన బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా దాని ఓటింగ్ శాతం పెరగడమే ఆశ్చర్యంగా ఉంది. అదీ ఆరు శాతం నుంచి ఒక్కసారిగా 30 శాతానికి పెరగడం మరీ విచిత్రం. మరి ఇంత ముందుగా జనం నాడి పట్టే ప్రయత్నాలు చేయడం ఎంత వరకూ సబబు అనేది కూడా ఆలోచించాల్సిందే.
Next Story