Mon Dec 23 2024 17:25:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫైరింగ్ ఒవైసీ పైనా...? ఓటింగ్ పైనా...?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై కాల్పులు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై కాల్పులు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ముస్లింలు సంఘటితంగా ఎంఐఎం పక్షాన నిలిచే అవకాశాలున్నాయి. ఖచ్చితంగా బీజేపీకి కూడా ఇదే కావాలి. ముస్లిం ఓట్లు ఇటు సమాజ్ వాదీ పార్టీకి, అటు కాంగ్రెస్ కు పోల్ కాకూడదు. అప్పుడే యూపీలో తమ విజయావకాశాలు మరింత మెరుగవుతాయి.
కాల్పుల వ్యవహారాన్ని....
అసదుద్దీన్ పై కాల్పుల వ్యవహారాన్ని పరిశీలిస్తే వారు నామ్ కే వాస్తేగానే వ్యవహరించారని అర్థమవుతుంది. దుండగులు కదులుతున్న కారుపై కాల్పులు జరపడమంటేనే అందులో సీరియస్ నెస్ లేనట్లని పోలీసులు సయితం భావిస్తున్నారు. నిజంగా అసద్ హత్యకు కుట్ర పన్ని ఉంటే దాడి ఆ తరహాలో చేసి ఉండేవారు కాదన్నది కూడా వాస్తవం. కాల్పులు జరిగింది వాస్తవం. ఈ కాల్పుల్లో కారు టైర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. ఈ తరహా దాడిని తమకు ప్రయోజనం చేకూర్చేందుకు చేస్తారని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఎస్సీ ని దెబ్బతీసేందుకు...
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ దాదాపు వంద స్థానాల్లో పోటీ చేస్తుంది. సుహెల్దావ్ భారతీయ సమాజ్ పార్టీ తో పొత్తు పెట్టుకుని ఎంఐఎం బరిలోకి దిగింది. మొన్నటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లిం ఓటు బ్యాంకు సమాజ్ వాదీ పార్టీకి అండగా ఉండేది. ఒకప్పుడు కాంగ్రెస్ వెంట నడిచిన ఈ ఓటు బ్యాంకు ఎస్సీకి సొంతమయింది. ఇప్పుడు పోటీ బీజేపీ, ఎస్సీ మధ్యనే ఉందన్నది అనేక సర్వేలు వెల్లడించాయి.
ఆయన పుంజుకుంటేనే?
ఈ నేపథ్యంలో ఒవైసీ పార్టీ పుంజుకోవడం బీజేపీకి కావాలి. అత్యధికంగా ఉన్న ముస్లిం ఓట్లు ఒవైసీ వైపు టర్న్ అయితే ఎస్సీకి ఇబ్బంది ఎదురవుతుంది. ఈ కాల్పుల ఘటన బీజేపీకి కలసి వస్తుందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. బీహార్ లో ఒవైసీ వల్లనే అక్కడ బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి రాగలిగింది. కానీ యూపీలో ఎంఐఎం వైపు మొగ్గు చూపితేనే బీజేపీ లాభపడుతుంది. ఇప్పుడు ఒవైసీపై కాల్పులు జరగడంతో సానుభూతి పెరిగి ఎంఐఎం బలం పుంజుకుంటుందన్న అంచనాలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒవైసీకి జడ్ కేటగిరి భద్రతను కల్పిస్తామన్నా ఒవైసీ నిరాకరించడం విశేషం.
గత ఎన్నికల్లో.....
2017 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలోనూ ఎంఐఎం పోటీ చేసింది. అయితే ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఈసారి అసదుద్దీన్ ఒవైసీ వంద స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. మహారాష్ట్ర, బీహార్ లో కాలుమోపిన ఎంఐఎం యూపీలో ఈసారి ఎలాగైనా ఎంటర్ అవ్వాలని చూస్తుంది. ఈ కాల్పుల ఘటనతో ఎంఐఎం కు కొంత అనుకూల వాతావరణం ఏర్పడిందంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. ఎస్పీని దెబ్బకొట్టేందుకే ఈ కాల్పుల ఘటన జరిగిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
Next Story