Tue Dec 24 2024 17:00:29 GMT+0000 (Coordinated Universal Time)
అలా చేస్తే గ్యారంటీగా విజయమా?
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నడూ జరగని విధంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.
జగన్ తాను చెప్పినట్లుగానే చేసుకుపోతున్నాడు. మొత్తం మంత్రి వర్గం చేత రాజీనామా చేయించాడు. ప్రస్తుతం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా మరో మంత్రి లేరనే చెప్పాలి. రాజీనామాలు జగన్ కు ఇచ్చేసిన మంత్రులు తమ సొంత వాహనాల్లో బయలుదేరి వెళ్లిపోయారు. ఎలాంటి అసంతృప్తులు లేవు. ముందుగానే జగన్ మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో దాదాపు అందరూ మానసికంగా సిద్దమయిపోయారు. అదే ఇప్పుడు జగన్ కు అడ్వాంటేజీ అయింది.
ఎన్నడూ లేని విధంగా....
అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నడూ జరగని విధంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. మరి రాజకీయంగా జగన్ కు ఈ నిర్ణయం ఏ మేరకు లాభిస్తుందో తెలియదు కాని, ఈ రెండు నెలలు జగన్ కు కత్తిమీద సామే. పార్టీలో ఈ రెండేళ్లలో విభేదాలు మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే అగ్రకులాల నేతలకు, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థిితి బాగా కన్పిస్తుంది.
ప్రాధాన్యత వారికే...
ఇప్పుడు జగన్ మంత్రి వర్గంలో అగ్రకులాలకు ప్రాధాన్యత గతంలో కంటే తగ్గించాలని భావిస్తున్నారు. ఎన్నికల టీం కావడంతో ఎక్కువ మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మంత్రివర్గంలోకి చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంలో జగన్ ఉన్నారు. ఈ మేరకు కొందరికి జగన్ సంకేతాలు ఇచ్చారు కూడా. సీనియర్లు, తన వెంట ఇన్నాళ్లు నడిచిన వాళ్లు త్యాగాలు చేయాలని, మరోసారి అధికారంలోకి రావాలంటే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాలని సూచించినట్లు తెలిసింది.
ఎన్నికల వేళ ఈ ప్రయోగం.....
దీంతో సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగానే మంత్రి వర్గ విస్తరణ జరగనుందని అర్థమయింది. అయితే మంత్రులుగా వారిని నియమిస్తూ ఆ సామాజికవర్గం మొత్తం జగన్ కు అండగా నిలుస్తుందా? అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. అలాంటప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ ప్రయోగమెందుకున్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఎవరు ఉన్నా అక్కడ పెత్తనం చెలాయించేది అగ్రవర్ణాలే. ఆ మాత్రం దానికి మంత్రివర్గంలో స్థానం కల్పించినంత మాత్రాన గంపగుత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓట్లు పడతాయని జగన్ ఎలా అనుకుంటున్నాడన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జగన్ నిర్ణయంతో రెడ్డి సామాజికవర్గం నేతలకు ఈసారి కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. వారిలో అసంతృప్తి తలెత్తితే జగన్ దబిడి దిబిడే. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story