Fri Jan 10 2025 23:09:47 GMT+0000 (Coordinated Universal Time)
ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు మేయర్ పరిచయంతో .. పరిణయం
తిరువనంతపురం నగర కార్పొరేషన్ మేయర్ ఆర్యా రాజేంద్రన్ తో ఎమ్మెల్యే సచిన్ దేవ్ వివాహం జరగనుంది.
కేరళలో ఆదర్శ వివాహాలు ఎక్కువగా ఉంటాయి. అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చు. అంతేకాదు ఒకే పార్టీకి చెందిన వారు వివాహాలు చేసుకోవడం కేరళలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా తిరువనంతపురం నగర కార్పొరేషన్ మేయర్ ఆర్యా రాజేంద్రన్ తో ఎమ్మెల్యే సచిన్ దేవ్ వివాహం జరగనుంది. ఈ నెల 4న తిరువనంతపురంలోని ఏకేజీ హాలులో జరగనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. ఇద్దరూ అతి చిన్న వయసులోనే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన మేయర్ గా ఆర్యారాజేంద్రన్, అత్యంత చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేగా సచిన్ దేవ్ గుర్తింపు పొందారు.
ఇద్దరూ సీపీఎం నుంచి...
ఇద్దరూ సీపీఎం కు చెందిన నేతలు. ఇద్దరూ తమ అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అంగీకరించారు. ఇద్దరిదీ ఒకే రాజకీయ సిద్ధాంతం కావడంతో పెళ్లికి అడ్డంకులు ఎదురుకాలేదు. ఇద్దరూ ఎస్ఎఫ్ఐలో కలసి పనిచేశారు. ప్రియ సీపీఎంలో చురుకైన సభ్యుడు రాజేంద్రన్ కుమార్తె. 2020లో ఆమె తిరువనంతపురం మేయర్ గా ఎన్నికయ్యారు. అప్పుడు ఆమె బీఎస్సీ చదువుతుంది. కేవలం 21 సంవత్సరాలు. దేశంలోనే అతి చిన్న వయసుగల మేయర్ గా గుర్తింపు పొందారు.
చిన్న వయసులోనే....
ఇక సచిన్ దేవ్ కూడా దేశంలోనే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోజికోడ్ లోని ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. కేరళలో జరిగిన ఎన్నికల్లో బాలుస్సేరి నియోజకవర్గం నుంచి సచిన్ దేవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. సచిన్ దేవ్, ఆర్యలకు బల సంఘంలో పనిచేసినప్పుటి నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం పరిణయానికి దారితీసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వీరు పెళ్లి ప్రయత్నాలు చేశారు. రెండు కుటుంబాలు అంగీకరించడంతో వీరి వివాహం ఈ నెల 4వ తేదీన జరగనుంది.
Next Story