Thu Dec 19 2024 19:24:47 GMT+0000 (Coordinated Universal Time)
తిరుగుబాట్లు.. బీజేపీలో ఎప్పుడూ లేదే
కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని ముఠా కుమ్ములాటలు, అసమ్మతి కన్నడ బీజేపీలో భగ్గుమంటున్నాయి
సిద్ధాంతాలు ఒకప్పుడు.. ఆర్ఎస్ఎస్ మూలాల ఉన్న వారు వచ్చి బీజేపీలో పనిచేస్తారు. పార్టీ కోసం వారు కష్టపడతారు. విజయంతో సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తారు. అటువంటి వారి పుణ్యమే ఈరోజు దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరడానికి కారణమని చెప్పకతప్పదు. దీర్ఘకాలంలో పార్టీకి వారి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మోదీ, అమిత్ షాల హయాంలో బీజేపీని పూర్తిగా మార్చారు. పేరు తప్ప సిద్ధాంతాలు అంటూ ఏమీ లేవు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అధికారం కోసం ఎవరినైనా చేర్చుకుంటారు. అటువంటి నేతలు ఎల్లకాలం పార్టీలో ఇమడలేరు.
గతంలో లేని విధంగా...
కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని ముఠా కుమ్ములాటలు, అసమ్మతి కన్నడ బీజేపీలో భగ్గుమంటున్నాయి. మోదీ లేదు.. షా లేదు.. మాకు టిక్కెట్ ఇవ్వరా? అంటూ పార్టీకి గుడ్‌బై చెబుతున్న వారి సంఖ్య రోజుకురోజుకూ పెరుగుతుంది. అసలే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత అంతగా లేదు. అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలున్న వారికి టిక్కెట్లు ఇవ్వలేదు. అది కరెక్టే. ఆ అవినీతికి ఆస్కారం ఎందుకు ఇచ్చారన్న దానిపై మాత్రం కమలనాధులు మాట్లాడటం లేదు. బీజేపీ పాలనలో ఎక్కువగా అవినీతి జరుగుతుందనడానికి కర్ణాటక ఉదాహరణగా చూపుతున్నారు.
అసమ్మతులతో...
మే 10న కర్ణాటక ఎన్నికలు జరుగనున్నాయి. 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కన్నడ నాట బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడం మొదలు పెట్టగానే రాజీనామాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. యడ్యూరప్ప లాంటి నేత కూడా ఇప్పుడు కన్నడ బీజేపీలో కరవవయ్యారు. ఆయనుంటే కొంత సర్దిచెప్పే వారంటారు. కానీ యడ్యూరప్ప కూడా పెద్దగా పార్టీని గురించి పట్టించుకోకపోవడం, తన కుమారుల విజయం కోసమే ఆయన ప్రధానంగా పనిచేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లారు. వారిలో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏ వర్గమూ...
బీజేపీలో ఏ వర్గమూ సంతృప్తికరంగా లేదు. ఇటు యడ్యూరప్ప వర్గం తమ నేతకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన చెందుతుండగా, ముఖ్యమంత్రి బొమ్మయ్ వర్గం కూడా గుర్రుగానే ఉంది లింగాయత్ సామాజికవర్గంలో అధికంగా పోటీ అభ్యర్థులను ఎంపిక చేశారని ఆ వర్గం ఆగ్రహంగానే ఉంది. టిక్కెట్లు దక్కని నేతలు కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఇది బీజీపీ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ పాలన పట్ల ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్న సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో మరోవైపు తిరుగుబాటు అభ్యర్థులతో కన్నడ కమలానికి తలనొప్పిగా తయారైంది. మరి చివరకు ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారన్నది బీజేపీ అభిమానులకు ఢిల్లీ వైపు చూడటం మినహా మరో మార్గం లేదు.
Next Story