Mon Dec 23 2024 08:19:30 GMT+0000 (Coordinated Universal Time)
త్యాగం చేయక తప్పదా?
ఈసారి పరిటాల సునీతకు రాప్తాడు సీటు ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఆచితూచి టిక్కెట్ల విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని ఒక విధానాన్ని పెట్టుకున్నారు. అన్ని చోట్ల ఆ విధానం వర్తించక పోవచ్చు. కొందరి విషయంలో మినహాయింపు లభించవచ్చు. అలాగని అందరికీ మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే రెండు చోట్ల కుటుంబ సభ్యులు పోటీ ఉంటే ప్రత్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక నియోజకవర్గం పైన పట్టు సాధించలేకపోవచ్చు. ఖర్చు విషయంలో కూడా వెనక్కు తగ్గవచ్చు. అందుకే చంద్రబాబు ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అని విధాన నిర్ణయంగా ప్రకటించారు.
ఒకే టిక్కెట్...
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కేఈ బ్రదర్స్ కు కూడా ఇది వర్తిస్తుందని పరోక్షంగా చెప్పారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వస్తే పరిటాల కుటుంబానికి ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన కుటుంబంగా పేరొన్న పరిటాల ఫ్యామిలీకి ఈసారి రెండు టిక్కెట్లు ఇస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఈసారి టీడీపీకి ప్రతి సీటు కీలకమైనదే. గత ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే కేటాయించారు. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగారు. అయితే వైసీపీ నేత తోపుదర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
సునీతమ్మకు మాత్రమే...
కానీ ఈసారి పరిటాల సునీతకు రాప్తాడు సీటు ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది. ఆ కుటుంబం ఒప్పుకున్నా, అభ్యంతరం వ్యక్తం చేసినా రాప్తాడు నుంచి సునీతను మాత్రమే పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. సునీత అయితేనే రాప్తాడులో గెలుపు అవకాశాలున్నాయని టీడీపీ అధినేత అంచనాగా ఉంది. అవసరమైతే పరిటాల శ్రీరామ్ కు పార్టీ పదవిని ఇవ్వాలని భావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా ఇవ్వవచ్చన్నది సీనియర్ నేతలు పరిటాల కుటుంబాన్ని నచ్చ చెబుతున్నారని తెలిసింది.
ధర్మవరం రిజర్వ్...
అయితే పరిటాల శ్రీరామ్ మాత్రం ధర్మవరం నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. ధర్మవరం టిక్కెట్ శ్రీరామ్ కు ఇస్తే రాప్తాడులో కూడా నష్టం జరిగే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా ఎన్నికల నాటికి టీడీపీలోకి వస్తారని, ఆయనకే ఈ టిక్కెట్ ను పెద్దాయన రిజర్వ్ చేసి ఉంచారని చెబుతున్నారు. గెలుపు కోసం కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పదని చంద్రబాబు సూచిస్తున్నారు. ధర్మవరం సీటు తనకు దక్కకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన పరిటాల శ్రీరామ్ ను చల్లబరిచి రాప్తాడుకే ఆ కుటుంబాన్ని పరిమితం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. శ్రీరామ్ ధర్మవరానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈసారికి మాత్రం త్యాగం చేయక తప్పదన్న సంకేతాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.
Next Story