Tue Nov 12 2024 19:40:01 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఏడాది అందరికీ కీలకమే
ఈ ఏడాది రాజకీయ పార్టీలకు కీలకం. ఉత్తరాది, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో అనేక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఏడాది రాజకీయ పార్టీలకు కీలకం. ఉత్తరాది, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో అనేక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. కమ్యునిస్టులకు కూడా త్రిపుర లాంటి రాష్ట్రం ఉండనే ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి 2024 సార్వత్రిక ఎన్నికలకు విజయాన్ని చేరువ చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. తొమ్మిది రాష్ట్రాల్లో ఐదు పెద్ద రాష్ట్రాలు కాగా, నాలుగు చిన్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో గెలుపు కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ కసరత్తులు మొదలుపెట్టాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లలో ఎన్నికలు జరగనున్నాయి.
తొమ్మిది రాష్ట్రాలకు...
వచ్చే నెల లేదా మార్చి నెలల మధ్య మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇందులో త్రిపురలో మరోసారి బీజేపీ గెలవడం అంత సులువు కాదు. కమ్యునిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి త్రిపురలో అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా తిరిగి కమ్యునిస్టులకు అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. నాగాలాండ్, మేఘాలయలో కూడా అధికారంలో భాగస్వామిగా ఉంది. ఈ రాష్ట్రాల్లోనూ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ లతో పోటీ పడాల్సి ఉంది. అలాగే తర్వాత మిజోరాంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.
అధికారంలో ఉన్న చోట...
ఇక మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా పార్టీలో చీలికల కారణంగా బీజేపీయే అధికారాన్ని చేపట్టింది. రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. అక్కడ బీజేపీ గెలవాల్సినఅవసరం ఉంది. ఇక తెలంగాణలో గెలుపు అంత సులువు కాదు. బలమైన, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను బీజేపీ ఎదుర్కొనాల్సి ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీ, కాంగ్రెస్ లకు అంత ఆషామాషీ కాదు. ఇక కర్ణాటకలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరు జరగనుంది.
కాంగ్రెస్, బీజేపీల కసరత్తులు...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కొంత ఆ పార్టీలో నూతనోత్తాజాన్ని నింపింది. కొంత వరకూ కాంగ్రెస్ కు కొన్ని రాష్ట్రాల్లో ఆ యాత్ర ఊపిరిలిచ్చిందనే చెప్పాలి. అలాగే బీజేపీ కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుని తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలపైనే చర్చించింది. ఆ ఎన్నికల్లో గెలవడానికి రోడ్డు మ్యాప్ ను రూపొందించుకుంది. తొమ్మిది రాష్ట్రాల్లోనూ అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటిని అధిగమించి అధికారంలోకి రావాల్సి ఉంది. మరోవైపు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా ఖమ్మంలో భారీ సభను ఈరోజు ఏర్పాటు చేసింది. సీపీఐ, సీపీఎంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను సభకు తీసుకు వచ్చి ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బీజేపీ, కాంగ్రెస్ లకు తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి.
Next Story