Mon Dec 23 2024 12:40:12 GMT+0000 (Coordinated Universal Time)
తీరంలో తీన్ మార్
విశాఖలో మూడు పార్టీలు మూడు కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
విశాఖ గర్జన మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకవైపు విశాఖ గర్జన..మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యక్రమాలు. ఇంకో వైపు టీడీపీ ఉత్తరాంధ్ర నేతల సమావేశం. దీంతో విశాఖలో టిెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జగన్ ప్రభుత్వం భావించినా అందుకు అన్ని రకాలుగా అడ్డుపడుతుండటంతో విశాఖ గర్జన పేరుతో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.
పోలీసులు అనుమతిచ్చినా...
విశాఖ గర్జనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ గర్జనకు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డాబా గర్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్ లోని వైఎస్సార్ విగ్రహం వరకూ ఈ ర్యాలీ కొనసాగనుంది. అయితే విశాఖలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది. అయినా లెక్క చేయకుండా గర్జనలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కళారూపాలను ప్రదర్శించనున్నారు.
జనసేన నేతలతో...
ఈరోజు విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖకు చేరుకుని నోవాటెల్ లో బస చేస్తారు. అక్కడే సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ నేతలతో సమావేశమవువతారు. వారితో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. రేపు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి ప్రజల సమస్యలను వినతుల రూపంలో స్వీకరిస్తారు.
టీడీపీ విస్తృత స్థాయి
ఈరోజునే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమం పెట్టుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. జగన్ ప్రభుత్వం కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపై చర్చించనున్నారు. దీంతో విశాఖలో మూడు పార్టీలూ మూడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story