Mon Dec 23 2024 00:56:55 GMT+0000 (Coordinated Universal Time)
రాజుగారిని షిఫ్టింగ్.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు టీడీపీ నుంచి టిక్కెట్ దాదాపుగా ఖరారయింది. దీంతో ఆయన అప్పుడే అక్కడ పని మొదలు పెట్టేశారు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు టీడీపీ నుంచి టిక్కెట్ దాదాపుగా ఖరారయింది. దీంతో ఆయన అప్పుడే అక్కడ పని మొదలు పెట్టేశారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా ఆయన పోట ీచేయడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే రాజీనామా చేస్తానని చెప్పిన రఘురామ కృష్ణరాజు ఆ ఊసే మరిచారన్నది పొలిటికల్ సర్కిళ్లల్లో వినిపిస్తున్న టాక్. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉన్నా కాకినాడ సీటులో పోటీ చేయాలని, ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని రఘురామ కృష్ణరాజుకు చంద్రబాబు సూచించారని తెలుస్తోంది.
గతంలో కృష్ణంరాజు....
కాకినాడలో టీడీపీ, జనసేన బలంగా ఉంది. 1998 లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కృష్ణంరాజు కాకినాడ నుంచే విజయం సాధించారు. అందుకే రఘురామ కృష్ణరాజును ఎవరితో పొత్తు ఉన్నా కాకినాడ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు డిసైడ్ చేశారంటున్నారు. ఇక్కడ రఘురామ కృష్ణరాజు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు చేయించుకున్న సర్వేల ద్వారా తేలిందని చెబుతున్నారు. రఘురామ కృష్ణరాజు కూడా అందుకు సిద్ధంగానే ఉన్నానని తెలపడంతో ఆయనకు కాకినాడ ఎంపీ సీటు టీడీపీ నుంచి ఖరారయిందంటున్నారు.
ఇప్పటి నుంచే...
అందుకే ఆయన గత కొంత కాలంగా చాపకింద నీరులా కాకినాడలో పనిచేసుకుంటున్నారని తెలిసింది. ఆయన అక్కడి లోకల్ మీడియాతో టచ్ లో ఉండి తనకు అనుకూలంగా ఇప్పటి నుంచే ప్రచారాన్ని చేసుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి రఘురామ కృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానాన్ని పొత్తు కుదిరితే జనసేనకు లేకుంటే టీడీపీ మాత్రమే పోటీ చేయాలని భావిస్తుంది. అక్కడ వెంకట శివరామరాజు (కలవపూడి శివ) ఉన్నారు. అందుకే రఘురామ కృష్ణరాజును నరసాపురం నుంచి కాకినాకు షిఫ్ట్ చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
నరసాపురం మాత్రం....
రఘురామ కృష్ణరాజుకు కూడా ఇదేమీ పెద్ద కష్టం కాదు. గతంలో కృష్ణంరాజు గెలవడం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన బలంగా ఉండటం కూడా ఆయన అంగీకారానికి కారణంగా చెబుతున్నారు. నరసాపురం సొంత నియోజకవర్గమైనా ఎంపీగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే వీలుండటంతో ఆయన అంగీకరించారంటున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు కుదిరితే ఇక కాకినాడలో తనది వన్ సైడ్ విజయం అని ఆయన భావిస్తున్నారు. అందుకే రఘురామ కృష్ణరాజు కాకినాడపై ఫోకస్ పెట్టారట. నేరుగా కాకున్నా పరోక్షంగా అక్కడ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారన్నది టాక్.
Next Story