Mon Dec 23 2024 04:52:05 GMT+0000 (Coordinated Universal Time)
అక్క .. తమ్ముడు.. ఒక పొలిటికల్ స్టోరీ
భూమా కుటుంబంలో టిక్కెట్ చిచ్చు రేపుతుంది. ఆళ్లగడ్డ, నంద్యాల టిక్కెట్లు ఈసారి ఆ కుటుంబానికి ఇస్తారా అన్నది కూడా అనుమానమే
రాజకీయాల్లో కుటుంబ బంధాలకు తావులేదు. ఎవరి పార్టీ వారిదేననుకునే రోజులివే. ఎవరికి వారే రాజకీయంగా ఎదగాలనుకుంటారు. ఇప్పుడు భూమా కుటుంబంలోనూ చిచ్చు రేపింది. ఆళ్లగడ్డ, నంద్యాల టిక్కెట్లు ఈసారి భూమా కుటుంబానికి ఇస్తారా? లేదా? అన్నది కూడా అనుమానమే. ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికే ఇచ్చినా, నంద్యాలలో అభ్యర్థిని మార్చే అవకాశముందంటున్నారు. బ్రహ్మానందరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
నంద్యాలలో....
నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి యాక్టివ్ గానే ఉన్నా శిల్పా కుటుంబాన్ని తట్టుకోలేరన్న భావనలో టీడీపీ అధినేత ఉన్నట్లు సమాచారం. పారిశ్రామిక వేత్త ఎస్సీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో ఎస్పీవై కుటుంబానికి ఉన్న పేరు, ప్రఖ్యాతులు ఆయనను గెలిపిస్తాయని, శిల్పా కుటంబంపై ఉన్న వ్యతిరేకతను భూమా బ్రహ్మానందరెడ్డి క్యాష్ చేసుకోలేరని భావిస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కావడం కూడా ఆయన పట్ల హైకమాండ్ విముఖంగా ఉందని సమాచారం.
అఖిలప్రియ కూడా...
ఇక ఆళ్లగడ్డ విషయానికి వస్తే అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఆమె ఈసారి టిక్కెట్ తనకేనని నమ్ముతున్నారు. అయితే ఆమె సొంత సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి కూడా టిక్కెట్ ను ఆశిస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ్ముడికి అంత వయసు లేదని, తగిన సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని భూమా అఖిలప్రియ చెబుతున్నప్పటికీ జగద్విఖ్యాత్ రెడ్డి ఈసారి పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలిసింది.
ఫరూక్ కామెంట్స్ తో....
మరోవైపు భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డలో ఇమేజ్ తగ్గడంతో తాను కూడా పోటీ చేయడానికి సిద్ధమని భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీలో చేరినప్పటికీ ఆయన టీడీపీలో చేరి పార్టీ టిక్కెట్ ను సాధించే పనిలో ఉన్నారు. అయితే భూమా కుటుంబంలో ఒకరికి ఆళ్లగడ్డ టిక్కెట్ ఇవ్వనున్నారు. అది అఖిలప్రియకా? జగద్విఖ్యాత్ రెడ్డికా? అన్నది చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన బాదుడే బాదుడే కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి ఇద్దరిలో ఎవరనేది కార్యకర్తలు నిర్ణయిస్తారని, అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఇది ఆళ్లగడ్డ టీడీపీని షేక్ చేస్తుంది.
Next Story